వంట నూనెల ధరల మంట అధికమవుతోంది. గత నెల రోజులుగా చిల్లర మార్కెట్‌లో ప్రధాన వంట నూనెల ధరలు మండిపోతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు అధికంగా వినియోగించే పామాయిల్ ధర లీటరుకు రూ. 70 నుంచి 78కి పెరగడం గమనార్హం. ఇది ప్రభుత్వం నిర్వహించే రైతుబజార్లలో విక్రయించే ధర అని తెలంగాణ రాష్ట్ర నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య - ఆయిల్‌ఫెడ్ తెలిపింది. విజయ బ్యాండు పేరిట సమాఖ్య వంట నూనెలు విక్రయిస్తోంది. ఇలా కేవలం 20 రోజుల్లో లీటరు ధర రూ. 8 వరకు పెరగడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి అని సమాఖ్య వర్గాలు స్పష్టం చేశాయి.
రాష్ట్రంపై ప్రభావం..
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి పామాయిల్ ధర పెరుగుదల ప్రభావం తెలంగాణపై పడింది. గత డిసెంబరు మాసంలో ఒక టన్ను శుద్ధి చేసిన పామాయిల్ ధర 510 డాలర్లు ఉంటే... ఇప్పుడు 600 డాలర్లు దాటింది. ముడి పామాయిల్ ధర 482 నుంచి 541 డాలర్లకు పెరిగింది. ఈ కాల వ్యవధిలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 70.83 నుంచి 71.09 చేరిందని... అయినా అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం పామాయిల్ ధర పండుతోందని "ది సాలెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ ఆఫ్ ఇండియా - సీ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
ఇతర వంట నూనెలపైనా..
చౌక ధరల దుకాణాల్లో రేషన్ కార్డులపై పామాయిల్ ప్యాకెట్లు పౌరసరఫరాల శాఖ విక్రయిస్తున్న దృష్ట్యా అధిక శాతం వంట నూనెగా దీనిని వినియోగిస్తున్నారు. ధర పెరుగుదల ఇతర వంట నూనెలపైనా పడింది. గత నెలలో దసరా పర్వదినం నుంచి పండుగల సీజన్ ప్రారంభం కావడం కూడా డిమాండ్‌కు మరొక కారణమని చెప్పవచ్చు. పామాయిల్ బదులు పొద్దుతిరుగుడు నూనెను కొందరు కొంటున్న దృష్ట్యా దాని ధర రైతుబజార్లలో రూ. 90 నుంచి 93 కు పెరిగిందని ఆయిల్‌ఫెడ్ వివరించింది. గత ఏడాది కాలంలో అంతర్జాతీయ మార్కెట్‌లో పామాయిల్ ధర 3 శాతం పెరిగినట్లు సీ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
విదేశాలపైనే..
దేశంలోకి ఇటీవల కాలంలో ముడి పామాయిల్ కన్నా శుద్ధి చేసిన నూనెను నేరుగా దిగుమతి చేసుకోవడం పెరుగుతోంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే... గత ఏడాది శుద్ధి చేసిన పామాయిల్ అదనంగా 6 లక్షల టన్నులు ఎక్కువగా వచ్చింది. దేశంలో ఆయిల్‌పాం తోటల సాగు పెద్దగా లేనందున విదేశాలపైనే ఈ నూనెకు ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. ఫలితంగా ఇండోనేషియా, మలేషియా దేశాల్లో తీసుకున్న నిర్ణయాలు భారత్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయని ఉద్యాన శాఖ పేర్కొంది.
సామాన్యుడికి పామాయిల్ పోటు ఇదీ చూడండి: 'ఆర్టీసీ సమ్మెపై 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి'