ఆస్పత్రుల్లో బతుకు పోరాటం చేసి ఆఖరి దశకు చేరిన రోగులకు, వారి కుటుంబ సభ్యులకు హైదరాబాద్లోని స్పర్శ్ హాస్పిస్ పాలియేటివ్ కేర్ సెంటర్ అండగా నిలుస్తోంది. వివిధ రకాల క్యాన్సర్లతో బాధపడుతూ చివరి దశకు చేరిన రోగులను అక్కున చేర్చుకొని ఆత్మీయంగా పలకరిస్తోంది. చివరి క్షణాల్లో అనుభవించే మనోవేదన నుంచి బయటపడేస్తోంది. రోగులను ఇంట్లో ఉంచి సేవలు చేసేందుకు అనువుగా లేని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆసరాగా నిలుస్తూ వారిలో ధైర్యాన్ని నింపుతోంది.
అద్దె భవనంలో మొదలై..
డాక్టర్ సుబ్రహ్మణ్యం మద్దిరాల ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ బంజారాహిల్స్ స్వచ్ఛంద సంస్థ 2011లో రోడ్ నం.12లో ఓ అద్దె భవనంలో ఈ స్పర్శ్ హాస్పిస్ సేవలను ప్రారంభించారు. 12 పడకలతో స్పర్శ్ హాస్పిస్ సేవలు మొదలయ్యాయి. మొదట్లో పాలియేటివ్ కేర్ సేవలపై ప్రజల్లో అవగాహన లేకపోవడంతో పెద్దగా రోగులు రాలేదు. క్రమంగా స్పర్శ్ హాస్పిస్ సేవలపై విస్తృత ప్రచారం జరగడంతో తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి రోగుల రాక మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో సగటున ఏడాదికి లక్ష క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. వారిలో 50 శాతం మందే క్యాన్సర్ నుంచి కోలుకుంటుండగా మిగతా సగం మంది ఎన్నో బాధలు అనుభవిస్తూ తనువు చాలిస్తున్నారు. ఒక్క హైదరాబాద్ మహానగరంలో రోజుకు 200 నుంచి 300 మంది క్యాన్సర్ రోగులు టెర్మినల్ అవుతున్నారు. బసవతారకం ఇండో -అమెరికన్ ఆస్పత్రితో పాటు ఏంఎన్జే లాంటి క్యాన్సర్ ఆస్పత్రిల్లో రోజుకు పెద్ద సంఖ్యలో టెర్మినల్ కేసులు నమోదవుతున్నాయి. ఇలా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో క్యాన్సర్తో టెర్మినల్ అవుతున్న వారందరిని అక్కున చేర్చుకోవాలని స్పర్శ్ హాస్పిస్ నిర్ణయించింది.
అనుభవజ్ఞులైన వైద్యులతో..
పాలియేటివ్ కేర్లో సుమారు 10 ఏళ్ల అనుభవం, ప్రత్యేకంగా శిక్షణ పొందిన వైద్యులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద కార్యకర్తలు ఉండటంతో ఇన్పేషంట్స్కే కాకుండా హోంకేర్ సేవలను విస్తృతం చేసింది. అయితే ఈ సేవలను మరింత మందికి చేరువ చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఖాజాగూడలో ఎకరా స్థలంలో స్పర్శ్ హాస్పిస్కు సొంత భవనాన్ని నిర్మించుకున్నారు. అధునాతన భవనంలో పూర్తి వసతులతో 82 పడకలు ఏర్పాటు చేశారు. ఈసారి చిన్నారుల కోసం ప్రత్యేకంగా 10 పడకలను పిడియాట్రిక్ వార్డుగా కేటాయించారు. ముగ్గురు వైద్యులు, 30 మందికిపైగా నర్సింగ్ సిబ్బంది రోగులకు నిరంతరం ఇక్కడ అందుబాటులో ఉంటారు.
అంతిమ దశలో గౌరవంగా..