తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటినుంచే రెండో విడత పల్లెప్రగతి - నేటి నుంచే రెండో విడత పల్లెప్రగతికి శ్రీకారం

పల్లెసీమల రూపురేఖలు మార్చడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం రెండో దఫా కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. గతంలోనే నెల రోజుల పాటు పల్లెప్రగతి ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేసిన సర్కార్... నేటి నుంచి రెండో విడతను ప్రారంభించనుంది. ఈ దఫాలో పది రోజుల పాటు పల్లెప్రగతి నిర్వహించనున్నారు. పనుల పురోగతిపై క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు జరిపేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా రంగంలోకి దిగనున్నాయి.

pallepragathi programme in telangana
నేటి నుంచే రెండో విడత పల్లెప్రగతికి శ్రీకారం

By

Published : Jan 2, 2020, 4:11 AM IST

నేటి నుంచే రెండో విడత పల్లెప్రగతికి శ్రీకారం

రెండో దఫా పల్లెప్రగతి కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ్టి నుంచి పదిరోజులపాటు ఈ కార్యక్రమం ఉంటుంది. మొదటి దఫా పల్లెప్రగతిలో చేపట్టిన కార్యక్రమాలు, పనులు, ఫలితాలను సమీక్షించుకుంటూనే రెండో విడత పల్లెప్రగతి అమలు చేయనున్నారు. కార్యక్రమం కోసం ఇప్పటికే జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలు పూర్తయ్యాయి. మొదటి విడత తరహాలోనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా గ్రామసభల్లో పాల్గొంటారు. తొలి దఫా పల్లెప్రగతిలో చేపట్టిన కార్యక్రమాలు, పనులు, వాటి పురోగతిని గ్రామసభలో వివరిస్తారు. పంచాయతీకి వచ్చిన నిధులు, వాటి ఖర్చుల వివరాలు కూడా అందరి ముందు ఉంచుతారు. పనుల పురోగతిని సమీక్షించుకుంటూ రెండో విడతలో చేయాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తారు.

గ్రామాలను బాగు చేయడమే లక్ష్యం

పల్లెప్రగతి నిర్వహణలో విస్తృత ప్రజాభాగస్వామ్యాన్ని ఆహ్వానించడంతో పాటు గ్రామప్రణాళికలో సూచనలను స్వీకరిస్తారు. శ్రమదానంతో గ్రామంలోని పనులు చేసేలా ప్రజలను ప్రోత్సహించేలా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. విరాళాల ద్వారా గ్రామాలను బాగు చేసుకోవాలన్న సీఎం కేసీఆర్ పిలుపు మేరకు గతంలో కొన్ని గ్రామాల్లో విరాళాలు బాగానే వచ్చాయి. ఈ మారు కూడా విరాళాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించనున్నారు. చాలాచోట్ల పూర్వవిద్యార్థుల సమ్మేళనాలు నిర్వహించి విరాళాలు సేకరించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందిస్తున్నారు. పారిశుద్ధ్యం, పచ్చదనంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తారు. ప్రతి గ్రామానికి ఖచ్చితంగా డంపింగ్ యార్డు, వైకుంఠధామం, నర్సరీ ఉండాలన్న ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు, అధికారులు అవసరమైన చర్యలు తీసుకోనున్నారు.

ఆకస్మిక తనిఖీల కోసం ఫ్లయింగ్​ స్క్వాడ్స్​

పల్లెప్రగతి పనుల పురోగతిపై ఆకస్మిక తనిఖీల కోసం ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా రంగంలోకి దిగనున్నాయి. 50 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో ఫ్లయింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేశారు. ఒక్కో అధికారికి 12 మండలాల బాధ్యతలు అప్పగించారు. ఒక్కో మండలంలో రెండు గ్రామాలు అధికారులు ఆకస్మిక తనిఖీ చేయాల్సి ఉంటుంది. మార్చి నెలాఖరు వరకు అధికారుల తనిఖీలు కొనసాగుతాయి. విడతల వారీగా నిర్వహించే తనిఖీల ద్వారా పనుల పురోగతిని పరిశీలిస్తారు.

అలసత్వం వహిస్తే అంతే సంగతులు...

పల్లె ప్రగతి కార్యక్రమంలో అలసత్వం వహించినట్లు రుజువైతే అధికారులు, సర్పంచులపై పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఈ విషయంలో ఎలాంటి శషబిషలు ఉండబోవని... బాధ్యులైన వారిపై కఠిన చర్యలుంటాయని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ దిశగా ఇప్పటికే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కు దిశానిర్ధేశం చేశారు. ఇవాళ గ్రామాల్లో జరగనున్న గ్రామసభల్లో ఫ్లయింగ్ స్క్వాడ్స్ అధికారులు కూడా పాల్గొంటారు.

ఇవీ చూడండి: 'నేను సీఎం అవుతాననే చర్చే అవసరం లేదు"

ABOUT THE AUTHOR

...view details