తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటితో 'పల్లె ప్రగతి 2.0' ముగింపు - పల్లె ప్రగతి 2.O ముగింపు

పల్లెప్రగతి రెండో దఫా నేటితో ముగియనుంది. మొదటి విడతకు కొనసాగింపుగా ఈ నెల రెండున ప్రారంభమైన కార్యక్రమం... రాష్ట్ర వ్యాప్తంగా 12వేల 751 గ్రామాల్లో సాగింది. ఈ మారు ఫ్లైయింగ్ స్క్వాడ్స్​గా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు గ్రామాల్లో పల్లెప్రగతి పనుల పురోగతిని పరిశీలించారు. సంపూర్ణ అక్షరాస్యత ధ్యేయంతో ముందుకెళ్తోన్న రాష్ట్ర ప్రభుత్వం... గ్రామాల్లో వయోజన నిరక్షరాస్యుల వివరాలను సేకరించింది.

Palle Pragathi second Phase Programme end on 12 January 2020
నేటితో 'పల్లె ప్రగతి 2.O' ముగింపు

By

Published : Jan 12, 2020, 5:01 AM IST

Updated : Jan 12, 2020, 9:46 AM IST

నేటితో 'పల్లె ప్రగతి 2.O' ముగింపు

పల్లెసీమల రూపురేఖలను మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం రెండో విడత ఈ నెల 2న ప్రారంభమైంది. మొదటి దఫాలో నెలరోజుల పాటు జరిగిన పల్లెప్రగతిలో గ్రామాల ప్రణాళికలు సిద్ధం చేయటంతో పాటు పనులను చేపట్టారు. ప్రత్యేకించి పారిశుధ్యంపై ఎక్కువగా దృష్టి సారించారు. చాలా గ్రామాల్లో పచ్చదనం విషయంలో మంచి ఫలితాలే కనిపించాయి.

మొదటి విడతకు కొనసాగింపుగా...

మొదటి విడత స్ఫూర్తిని కొనసాగిస్తూ పది రోజుల పాటు రెండో విడత కార్యక్రమాన్ని చేపట్టారు. మొదటి రోజు గ్రామసభలు నిర్వహించి తొలి విడత పురోగతిని సమీక్షించుకుంటూ రెండో దఫా పనులకు శ్రీకారం చుట్టారు. అటు మొదటి విడతలో పల్లెప్రగతి తీరు, పనుల పురోగతిని తనిఖీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్లైయింగ్ స్క్వాడ్స్​ను ఏర్పాటు చేసింది. 50 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను ఎంపిక చేసి 12 మండలాల బాధ్యతలు అప్పగించింది.

పారిశుధ్యంపైనే ఎక్కువ దృష్టి

రెండో దఫా పల్లెప్రగతి సమయంలో ఫ్లైయింగ్ స్క్వాడ్స్ గ్రామాల్లో పర్యటించాయి. పనుల పురోగతిని పరిశీలించాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకున్న గ్రామాల్లో పరిస్థితులు బాగున్నాయని, పనులు పురోగతిలో ఉన్నాయని గమనించారు. రాష్ట్రంలో మొత్తం 12వేల 751 గ్రామపంచాయతీలకు గాను 12వేల 748 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహించి చేయాల్సిన పనులను గుర్తించారు. పారిశుధ్యం విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించారు. గ్రామాల్లో శ్రమదానం కూడా నిర్వహించారు.

నిరక్షరాస్యుల వివరాలను సేకరించిన ప్రభుత్వం

జిల్లాల వారీగా పల్లెప్రగతి పురోగతి శనివారం వరకు చూస్తే వికారాబాద్, మేడ్చల్, జగిత్యాల జిల్లాలు అగ్రస్థానంలో ఉన్నాయి. గుర్తించిన పనులన్నీ వందశాతం పూర్తయ్యాయి. నారాయణపేట జిల్లా చివరిస్థానంలో ఉంది. ఈ ఏడాది సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యాన్ని నిర్దేశించుకున్న రాష్ట్ర ప్రభుత్వం... పల్లెప్రగతి రెండో విడత సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో 18ఏళ్లు పైబడిన నిరక్షరాస్యుల వివరాలు సేకరించారు. 20 లక్షల 61 వేల 746 మంది చదువురాని వారు ఉన్నట్లు గుర్తించారు. అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో లక్షా 38వేల మంది, నల్గొండలో లక్షా 30వేల మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు తేలింది. నిర్మల్ జిల్లాలోనూ లక్షకు పైగా చదువురాని వయోజనులు ఉన్నారు. అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో తొమ్మిది వేలకు పైగా నిరక్షరాస్యులుగా ఉన్నట్లు గుర్తించారు.

ఇదీ చూడండి: బస్తీమే సవాల్: గులాబీ తోటలో వికసించేందుకు కమలనాథుల వ్యూహాలు...

Last Updated : Jan 12, 2020, 9:46 AM IST

ABOUT THE AUTHOR

...view details