నేడు రాష్ట్రవ్యాప్తంగా 'పల్లె ప్రగతి' వేడుకలు Telangana Palle Pragathi 2023 :రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారి.. దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 21 రోజుల పాటు జరుగుతున్న తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లోభాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పల్లె ప్రగతి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం ఊరూరా భారీ ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు.. గ్రామాల్లో వేడుకలు నిర్వహించేందుకు క్షేత్రస్థాయి ఏర్పాట్లలో అధికారులు, పంచాయతీ సిబ్బంది రెండు రోజులుగా నిమగ్నమయ్యారు. అలాగే గ్రామపంచాయతీలను ముస్తాబు చేసి, అందంగా తీర్చిదిద్దారు. నాడు-నేడు గ్రామాల‌్లో సౌకర్యాలు, పంచాయతీలుగా మారిన తండాలు, ఓడీఎఫ్ ప్లస్, ఆసరా పింఛనులు, గ్రామ పంచాయితీ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రగతి నివేదికలు తెలిపేలా ప్రత్యేక బ్యానర్లను పల్లెల్లో ప్రదర్శన ఏర్పాటు చేశారు.
Palle Pragathi Celebrations In Telangana :పల్లె ప్రగతి వేడుకల్లో భాగంగా ఉదయం గ్రామస్థులతో ర్యాలీ నిర్వహించి.. పంచాయతీ కార్యాలయం వద్ద జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం సఫాయి కార్మికులను పంచాయతీ పాలకవర్గం, అధికారులు సన్మానించి, ప్రశంసాపత్రాలను అందజేస్తారు. 9 ఏళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమాలతో గ్రామం సాధించిన పురోగతిని ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు నివేదించనున్నారు. కార్యక్రమాల అనంతరం, పలుచోట్ల సామూహిక భోజనాలు సైతం ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రతి గ్రామానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను విడుదల చేసింది. పల్లె ప్రగతి వేడుకల వేళ గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
Telangana Palle Pragathi Celebrations Today :పల్లె ప్రగతి వేడుకల్లో భాగంగా రాష్ట్రంలో కొత్తగా మంజూరైన గ్రామపంచాయతీ భవన నిర్మాణాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర స్థాయిలో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో సాయంత్రం రవీంద్రభారతిలో పల్లె ప్రగతి ఉత్సవాలు జరగనున్నాయి. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఉత్తమ గ్రామపంచాయతీల సర్పంచులు, ఉత్తమ మండలాల ఎంపీపీలను ఈ సందర్భంగా సత్కరించనున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పల్లె ప్రగతి దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామాలు సాధించిన అభివృద్ధిపై ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం.. సంపద పెంచు, ప్రజలకు పంచు అన్న నినాదంతో పాలన సాగుతోందని తెలిపింది. స్వరాష్ట్రమైన తెలంగాణఆచరిస్తోంటే.. దేశం అనుసరిస్తోందని వెల్లడించింది.
Telangana Decade Celebrations 2023 : అలాగే ఈ నెల 16న నిర్వహించే పట్టణ ప్రగతిలో రాష్ట్రంలోని అన్ని అర్బన్ మున్సిపాలిటీలలో ఉత్తమ మున్సిపల్ కార్మికులను ఘనంగా సన్మానించనున్నట్టు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ప్రతీ మున్సిపాలిటీలలో ర్యాలీలు నిర్వహించి, టీఎస్ బీపాస్పై వివరించనున్నట్టు పేర్కొన్నారు. తొమ్మిదేళ్లలో పట్టణ స్థానిక సంస్థలు సాధించిన ప్రగతిని తెలియచేస్తారని అన్నారు. మున్సిపల్ వాహనాలను అందంగా అలంకరించాలని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ శిల్పకళా వేదికలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. హైదారాబాద్లో కొత్తగా ఏర్పాటు చేసిన వార్డ్ కార్యాలయాలను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ప్రారంభిస్తారని వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలో జరిగిన అభివృద్ధిని తెలియచేసే అభివృద్ధిపై రూపొందించిన బుక్ లెట్లు, వీడియో చిత్రాలను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: