రేపట్నుంచి మరో విడత పల్లె, పట్టణప్రగతి కార్యక్రమాలు జరగనున్నాయి. గ్రామాల్లో నాలుగో విడతగా, పట్టణాల్లో మూడో దఫా ప్రగతి కార్యక్రమం పదిరోజుల పాటు జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన పురోగతిని సమీక్షించుకొని పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ అవసరమైన పనులు చేపడతారు. మొదటి రోజు గ్రామ, వార్డు సభలు నిర్వహించాల్సి ఉంటుంది. పల్లె, పట్టణప్రగతిలో భాగంగా ఇప్పటి వరకు చేసిన పనులను సభకు నివేదిస్తారు. పంచాయతీ ఆదాయ, వ్యయాలను కూడా వివరిస్తారు. పదిరోజుల పాటు చేసే పనులతో పాటు ఏడాది ప్రణాళిక ఖరారు కోసం అందరి సూచనలు తీసుకుంటారు. విస్తృత ప్రజా భాగస్వామ్యాన్ని ఆహ్వానించడంతో పాటు శ్రమదానంతో పనులు చేసేలా ప్రోత్సహించాల్సి ఉంటుంది. ఆయా ప్రాంతాల్లోని విశ్రాంత ఉద్యోగులు, మాజీ సైనికులను గుర్తించి వారందరినీ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
పారిశుద్ధ్యానికే ప్రాధాన్యత
ప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఎక్కడా చెత్త ఉండకుండా చూడడంతో పాటు మురికినీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. శిథిలాల వ్యర్థాలు, పిచ్చిమొక్కలు తొలగించాలి. రహదారులు, ఖాళీస్థలాలను శుభ్రం చేయాలి. వానాకాలం అయినందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూడడంతో పాటు దోమలు రాకుండా రసాయనాలు పిచికారీ చేయడం లాంటి చర్యలు తీసుకోవాలి. మంచినీటి వనరులను శుభ్రం చేయాలి. పదిరోజుల్లో ఒకరోజు పవర్ డేను పాటించి విద్యుత్‌కు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించాలి. గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు ఇంకా పూర్తి కాని చోట వెంటనే నిర్మాణాల పూర్తికి చర్యలు తీసుకోవాలి.
ఇంటికి రెండు మొక్కలు