మరో విడత పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. పది రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులను సమీక్షిస్తారు. ఇందుకోసం గ్రామాలు, పట్టణాల వారీగా పల్లెప్రగతి, పట్టణప్రగతి నివేదికలు తయారు చేశారు. ఆయా గ్రామాలు, పట్టణాలకు వచ్చిన నిధులు, చేసిన ఖర్చు, చేపట్టిన పనులు, ప్రస్తుతం వాటి స్థితి, అవసరాలు, తదితరాలను ఇందులో పొందుపర్చాల్సి ఉంటుంది. తొలిరోజైన ఇవాళ గ్రామ, వార్డు సభలు నిర్వహించాలి. సభ వేదికగా నివేదికలోని అంశాలను వెల్లడించి, సమీక్షించి భవిష్యత్ కార్యాచరణ, పదిరోజుల కోసం చేపట్టాల్సిన పనులపై అందరి సలహాలు, సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది. పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, హరితహారం, విద్యుత్ అంశాలు ప్రధాన ఎజెండాగా పదిరోజుల ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. చేయాల్సిన పనులకు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశారు.
పరిశుభ్రతకు ప్రాధాన్యం
రహదార్లు, ప్రజోపయోగ స్థలాలను శుభ్రంగా ఉంచడంతో పాటు రోడ్లపై గుంతలు ఫూడ్చివేయాలి. పాడుబడిన భవనాలు, శిథిలాలను తొలగించాలి. ఖాళీ స్థలాలకు సంబంధించి కూడా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. వాటిని కూడా శుభ్రం చేసి అందుకు అయిన ఖర్చు, జరిమానా, పాలనా వ్యయాన్ని యజమానుల నుంచి వసూలు చేయాలని స్పష్టం చేసింది. పాతబావులను పూడ్చివేయాలి. మురుగుకాల్వలు శుభ్రం చేయాలి. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో మురుగునీటిని తొలగించాలి. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. ఫాగింగ్, రసాయనాల పిచికారీ, ఆయిల్ బాల్స్ వేయడం వంటి కార్యక్రమాలు చేపట్టాలి, మంచినీటి వనరులను శుభ్రం చేసి క్లోరినేషన్ చేయాలి. వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల పనులన్నింటినీ పూర్తి చేసి వాటన్నింటినీ పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలి.
పవర్ డేను నిర్వహించాలి...
వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల చుట్టూ పెద్దపెద్ద మొక్కలతో గ్రీన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. పట్టణప్రాంతాల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలి. మరణించిన వారిని తరలించేందుకు అన్ని పట్టణాల్లో కనీసం ఒక వైకుంఠరథాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పల్లె, పట్టణప్రగతిలో భాగంగా ఒకరోజు పవర్ డే నిర్వహించి విద్యుత్ సంబంధిత సమస్యలు అన్నింటినీ పరిష్కరించుకోవాలి. వంగిన, తుప్పుపట్టిన, కూలిపోయిన స్తంభాలను తొలగించి కొత్తవాటిని ఏర్పాటు చేయాలి. వీధిదీపాలన్నింటినీ ఎల్ఈడీ బల్బులు అమర్చాలి.
ఏడో విడత హరితహారం
పల్లె, పట్టణప్రగతిలో భాగంగానే ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ దఫాలో 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పల్లెలు, పట్టణాల్లో ఉన్న అన్ని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ, రాష్ట్ర, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ అన్ని రకాల రహదార్ల వెంట పెద్దఎత్తున మొక్కలు నాటి రహదారి వనాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట రెండు, మూడు వరుసల్లో మొక్కలు నాటాల్సి ఉంటుంది. అవకాశం ఉన్న ప్రతి చోటా యాదాద్రి నమూనాలో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలి. గతంలో నాటిన మొక్కల్లో ఎక్కడైనా చనిపోయి ఉంటే వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటాలి. పాఠశాలలు, సంస్థలు, కార్యాలయాలు తదితర ప్రజోపయోగ సంస్థల ప్రాంగణాల్లో విరివిగా మొక్కలు నాటాలి, లేఅవుట్ల ఖాళీ స్థలాల్లోనూ మొక్కలు నాటి సంరక్షించాలి.