తెలంగాణ

telangana

ETV Bharat / state

PRAGATI: మూడో రోజూ ఉత్సాహంగా పల్లె, పట్టణప్రగతి కార్యక్రమాలు

రాష్ట్రంలో పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలు మూడోరోజు ఉత్సాహంగా సాగతున్నాయి. మంత్రులు, ప్రజాప్రతిధులు విరివిగా మొక్కలు నాటుతున్నారు. పర్యావరణ పరిరక్షణను ప్రజలు బాధ్యతగా తీసుకుని ముందుకు సాగాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

మూడో రోజూ ఉత్సాహంగా పల్లె, పట్టణప్రగతి కార్యక్రమాలు
మూడో రోజూ ఉత్సాహంగా పల్లె, పట్టణప్రగతి కార్యక్రమాలు

By

Published : Jul 3, 2021, 3:54 PM IST

రాష్ట్రంలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ప్రజలను భాగం చేస్తూ.. మూడో రోజూ ఉత్సాహంగా సాగుతున్నాయి. వేములవాడలో మంత్రి కేటీఆర్.. పట్టణ ప్రగతిలో పాల్గొన్నారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.

పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రగతి, హరితహారంలో భాగంగా సనత్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్‌పేట్‌, మోండా మార్కెట్ డివిజన్​లలో మంత్రి మొక్కలు నాటారు. చెట్లను పెంచడం వల్ల ఆక్సిజన్ సమృద్ధిగా లభిస్తుందని.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని సూచించారు. హరితహారం కార్యక్రమం వల్ల సకాలంలో వర్షాలు కురుస్తున్నాయన్న మంత్రి.. ఈ బృహత్​ కార్యక్రమాన్ని యజ్ఞంలా ముందుకు తీసుకెళ్లాలని ప్రజలకు సూచించారు.

పరిశుభ్రత పాటించాలి..

పచ్చదనం, పరిశుభ్రతతోనే మెరుగైన ఆరోగ్యం కలుగుతుందని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని కబూతర్ కమాన్, రామ్‌రావ్​బాగ్ కాలనీల్లో పట్టణ ప్రగతి పనులను మంత్రి పరిశీలించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు. చెట్లు విరివిగా ఉన్నప్పుడే ప్రాణవాయువు పుష్కలంగా లభిస్తుందన్న ఆయన.. స్వచ్ఛమైన గాలి ఎన్నో రోగాలను దూరం చేస్తుందన్నారు. మొక్కలు పెంచడం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలని తెలిపారు.

ప్రతి మొక్కను సంరక్షించుకోవాలి..

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హరితహారంలో పాల్గొన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్​ కమిటీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాలని.. అది ప్రతి ఒక్కరి బాధ్యతని కోనప్ప సూచించారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు జిల్లా పరిషత్​ ఉపాధ్యక్షుడు కోనేరు కృష్ణారావు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ కాసం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ పాలక వర్గ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్​ పరిశీలన..

వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో పల్లెప్రగతి పనులను జిల్లా కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఎల్కతుర్తి మండలంలోని గోపాల్​పూర్​లో నర్సరీని సందర్శించారు. మొక్కలు నాటి.. గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించారు. పల్లె ప్రగతి పనుల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

అనంతరం భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లిలో పల్లెప్రగతి పనులను పరిశీలించారు. పెండింగ్​లో ఉన్న వివిధ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పల్లెలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్​ పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్న కలెక్టర్​.. పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు.

మూడో రోజూ ఉత్సాహంగా పల్లె, పట్టణప్రగతి కార్యక్రమాలు

Minister Harish Rao: ఆయిల్​పామ్​ సాగు చేస్తే అన్నిరకాలుగా ఆదుకుంటాం

ABOUT THE AUTHOR

...view details