Palla Rajeshwar Reddy Fires On BJP: మునుగోడులో భాజపానే బోగస్ ఓట్లు నమోదు చేయించి.. వారే కోర్టుకు వెళ్లారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. భాజపాకు ఓటమి ఖాయమని తేలిపోవడంతో ఓటర్ల డ్రామాకు తెరలేపిందని విమర్శించారు. ఓట్లు తొలగించారు కాబట్టి ఓడిపోయామని చెప్పుకునేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆక్షేపించారు.
మునుగోడు ఎన్నికల తేదీని భాజపా నేతలు ముందే చెప్పి.. ఎన్నికల కమిషన్ వారి చేతుల్లోనే ఉందని నిరూపించుకుందని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. విపక్షాల కుయుక్తులను మునుగోడు ప్రజలు తిప్పికొడతారని అన్నారు. భాజపా రప్పిస్తున్న స్థానికేతరులను అధికారులు పంపిస్తున్నారని.. అందుకే మునుగోడు ఉపఎన్నిక కోసం కేంద్ర బలగాలు పంపాలని చెబుతున్నారని ఆరోపించారు. హుజూర్‌నగర్, సాగర్ ఉపఎన్నిక సమయంలోనూ కేంద్ర బలగాలను తెచ్చారని పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
వ్యయ పరిశీలకులను కూడా ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లను తీసుకువచ్చారని పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. అయితే ఎన్ని బలగాలు వచ్చినా నాగార్జునసాగర్, హుజూర్‌నగర్ ఫలితమే పునరావృతం అవుతుందని చెప్పారు. మునుగోడు ఉపఎన్నికల్లో కూడా భాజపాకు డిపాజిట్లు పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. మునుగోడు ఉపఎన్నికలో రాజగోపాల్ రెడ్డి ఓటమి తప్పదని.. తెరాస అద్భుత విజయం సాధిస్తుందని పల్లా రాజేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.