తెలంగాణ

telangana

ETV Bharat / state

వేగం పెరగదు.. ముందుకు సాగదు..!

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనుల్లో కొన్ని వేగంగా.. మరికొన్ని నెమ్మదిగా సాగుతున్నాయి. కీలకమైన మొదటి పంప్‌ హౌస్​కు సంబంధించి సర్కారు ఇంకా ఓ నిర్ణయానికి రానందున.. అక్కడ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. సమస్యలన్నీ పరిష్కరించి పనులను వేగవంతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

palamuru-rangareddy-lift-irrigation-scheme-1
వేగం పెరగదు.. ముందుకు సాగదు..!

By

Published : Feb 22, 2020, 5:16 AM IST

Updated : Feb 22, 2020, 7:18 AM IST

తెలంగాణ ప్రాజెక్టుల పునరాకృతిలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో.. కాళేశ్వరం తర్వాత పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చాలా కీలకమైంది. రోజుకు 2టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోసి 90 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకునేలా ఈ పథకానికి 2015లో తెరాస సర్కారు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. 18 ప్యాకేజీలుగా పనులను విభజించి ఒప్పందాలు కుదుర్చుకొంది. మూడేళ్లలో పనులు పూర్తి చేయాల్సి ఉండగా గడువులోగా 20% పని కూడా పూర్తి కాలేదు. ఫలితంగా.. గడువు పొడిగించారు. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న జలాశయాల పనులు 60 శాతం వరకు పూర్తి కాగా.. ఇతర పనులు 20 శాతం లోపే ఉన్నాయి.

వేగం పెరగదు.. ముందుకు సాగదు..!

ఆరు జలాశయాలకు.. ఐదు ఒప్పందాలు పూర్తి

ఆరు జలాశయాలకు గాను.. ఐదింటికి ఒప్పందాలు పూర్తయ్యాయి. అంజనగిరి, వీరాంజనేయ, వెంకటాద్రి, కరివెన, ఉద్దండాపూర్ జలాశయాల్లో.. మూడింటి పనులు బాగా జరిగాయి. వీరాంజనేయ జలాశయం పనులు 90% జరగ్గా.. ఉద్దండాపూర్ పనులు కేవలం 11శాతం మాత్రమే జరిగాయి. ఏదుల జలాశయం.. పూర్తి కావొచ్చింది.

నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నాయంటే..?

  1. పంప్ హౌస్​లు, సొరంగ మార్గాల పనులు బాగా వెనుకబడి ఉన్నాయి.
  2. ఏ పంప్ హౌస్​లోనూ 20 శాతం పనులు మించలేదు.
  3. సొరంగమార్గం పనులు కూడా.. 30 శాతం లోపే. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి నీటిని మళ్లించే కీలకమైన మొదటి పంప్ హౌస్ పనులింకా ప్రారంభం కాలేదు.
  4. ఈ పంప్ హౌస్​ను భూగర్భంలో నిర్మించాలా లేక భూమిపైనా అన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు.
  5. ఫలితంగా గుత్తేదారు పనులు ప్రారంభించలేని పరిస్థితి ఏర్పడింది.

పనుల వేగవంతానికి అధికారుల చర్యలు

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ఇప్పటి వరకు 25% వరకు మాత్రమే పూర్తయ్యాయి. 35 వేల కోట్ల రూపాయలతో.. పరిపాలనా అనుమతులివ్వగా.. పనులు, భూసేకరణ, అటవీ అనుమతులు ఇలా అన్నింటికి కలిపి జనవరి ఆఖరు వరకు.. రూ. 8 వేల 602 కోట్లు ఖర్చయ్యాయి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వచ్చిన రుణాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అధికంగా రూ.3 వేల కోట్ల చెల్లింపులు చేశారు. కొన్ని చోట్ల భూసేకరణకు సంబంధించి.. ఇబ్బందులు ఉన్నాయి. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల వేగవంతంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. పనుల వేగవంతానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఇవీ చూడండి:మహిళా భద్రతకు పోలీసుల సరికొత్త 'అస్త్రం'!

Last Updated : Feb 22, 2020, 7:18 AM IST

ABOUT THE AUTHOR

...view details