ఏడాదికి పైగా పాకిస్థాన్ జైల్లో మగ్గిన తెలుగు మత్స్యకారులు భారత్‌లో అడుగుపెట్టారు. 2018లో వేటకు వెళ్లి పొరపాటున పాక్ జలాల్లోకి ప్రవేశించిన 20 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాలర్లను... ఆ దేశ సైన్యం బంధించి జైల్లో పెట్టింది. కేంద్ర ప్రభుత్వ చర్చలతో వీరిని ఎట్టకేలకు విడుదల చేసింది. పాక్ నుంచి విడుదలైన మత్స్యకారులను తీసుకొచ్చేందుకు రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ వాఘా సరిహద్దుకు వెళ్లారు. వారంతా రేపటిలోగా స్వగ్రామాలకు చేరుకోనున్నారు.
ఎలా చిక్కారు?
పొట్టకూటి కోసం గుజరాత్‌కు వలస వెళ్లిన ఉత్తరాంధ్ర మత్స్యకారులు... వీరావల్‌లో చేపలవ్యాపారుల వద్ద పనిచేసేవారు. 2018 నవంబర్‌లో చేపల వేటకు వెళ్లిన 20 మంది పొరపాటున వీరావల్ తీరం నుంచి పాక్ జలాల్లోకి ప్రవేశించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వారంతా... అనుకోకుండా పాక్‌కు బందీలుగా మారి అక్కడి లంధి జైలులోశిక్ష అనుభవించారు. 2008 ఒప్పందం ప్రకారం భారత్, పాక్ ఏటా మత్స్యకారులు, ఖైదీలను విడుదల చేస్తూ వస్తున్నాయి. ఈసారి భారత విదేశాంగ చర్చలూ ఫలించి.. లంధి జైలు నుంచి 20 మందిని పాక్ విడుదల చేసింది.