వివిధ శాఖలు జలమండలికి బకాయిపడిన రూ.వందల కోట్ల పన్నులు చెల్లించేలా చూడాలని సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్‌కు ఆయన లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి రూ.1,267 కోట్లు, కేంద్రం నుంచి రూ.252 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని వివరించారు. నోటీసులు ఇచ్చినా సంబంధింత శాఖల అధికారులు స్పందించడం లేదని పేర్కొన్నారు. మిషన్ భగీరథ నుంచి రూ.601 కోట్లు, పంచాయతీరాజ్‌శాఖ రూ.594 కోట్లు, వైద్యారోగ్యశాఖ రూ.42 కోట్లు, గృహనిర్మాణ శాఖ రూ.22 కోట్లు, పోలీసుశాఖ రూ.15కోట్లు, సాధారణ పరిపాలనశాఖ రూ.9కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు. బకాయిలు వసూలు కాకపోవడంతో జలమండలి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. నిర్వహణకు నిధులు లేక పాతనీటి పైపులనే కొనసాగిస్తున్నారని, ఫలితంగా నల్లాల్లోకి మురికి నీరు చేరి బస్తీవాసులు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు.
‘‘జీహెచ్‌ఎంసీ, జలమండలికి నగర వాసులు వేర్వేరుగా పన్ను చెల్లిస్తున్నారు. నీటిపన్ను, మురికి కాల్వల పన్ను, విద్యుత్ దీపాల పన్ను, కన్జర్వేషన్ పన్నులన్నీ ఆస్తి పన్నులోనే ఉంటాయి. నగర పాలక సంస్థ చట్టం 199 ప్రకారం పౌరుడు కట్టే ఆస్తి పన్నులో ఇవన్నీ ఉంటాయి. కానీ, జలమండలి అధికారులు నీరు, మురికి కాల్వల పన్ను పేరిట మళ్లీ వసూలు చేస్తున్నారు. ఒకే పన్నును రెండు సార్లు చెల్లిస్తున్నా ప్రజలు నాణ్యమైన సేవలు పొందడం లేదు. ప్రభుత్వ శాఖలు రూ.వందల కోట్లు బకాయిలు పడినా జలమండలి ఏమీ చేయలేక పోతోంది. పేరుకుపోయిన మొండి బకాయిలు తక్షణమే చెల్లించేలా సంబంధిత శాఖాధికారులను ఆదేశించాలి’’ అని పద్మనాభరెడ్డి సీఎస్‌ను కోరారు.