Paddy Procurement Problems: రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత, ఇతర మౌలిక సదుపాయాల కల్పన లేమి... పెద్ద అవాంతరంగా మారింది. ధాన్యం సేకరణ వేగవంతంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం... రాష్ట్రవ్యాప్తంగా 3వేల381 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. మొత్తం 6వేల 812 కేంద్రాలు తెరవాలని అంచనా వేయగా... ఇప్పటి వరకు 3,381 కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరుగుతోంది. 49వేల 875 మంది రైతుల నుంచి 3లక్షల 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయింది. ఇందులో 3లక్షల 54 వేల మెట్రిక్ టన్నులు... మిల్లులకు తరలించారు. ధాన్యం తీసుకున్న రెండు మూడ్రోజుల్లో నగదు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని చెబుతున్నప్పటికీ... ఆచరణలో ఆ ప్రక్రియ సవ్యంగా జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు తరుగు, నాణ్యత పేరిట కొర్రీలు పెడుతున్నారని రైతులు వాపోతున్నారు.
యాసంగిలో 15 కోట్లు గన్నీ బ్యాగులు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటివరకు 7 కోట్ల 67 లక్షల గన్నీ బ్యాగులు సిద్ధం చేసినట్లు పౌరసరఫరాలశాఖ వెల్లడించింది. సేకరించిన ధాన్యం వెంటనే రైస్ మిల్లులకు చేర్చి ఓపీఎంఎస్లో గుర్తించాలని... అప్పుడే రైతులకు త్వరితగతిన నగదు బదిలీ చేసే అవకాశం ఉంటుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇదే సమయంలో ఎఫ్సీఐ ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపడుతుండటంతో... రైస్ మిల్లులకు ధాన్యం తరలింపు నిలిపివేయాల్సి వస్తుందని తెలిపారు. పీవీకి ఇది సరైన సమయం కానందున కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చొరవ తీసుకొని... రైతులకు సత్వర సేవలు అందేలా చూడాల్సిన బాధ్యతలు తీసుకోవాలని కోరారు. సరైన సమయంలో పీవీ చేయడమే కాకుండా... ఎలాంటి అక్రమాలున్నా ప్రభుత్వం ఉపేక్షించబోదని మంత్రి పేర్కొన్నారు.