2019-20 సంవత్సరంలో 1.3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తితో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ)లో నిలవ ఉన్న ధాన్యంలో రాష్ట్రం వాటా 63 శాతం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీటి పారుదల ప్రాజెక్టుల కింద వరి సాగు పెరగటంతో గతేడాదితో పోలిస్తే 20 శాతం అధికంగా ఉత్పత్తయింది. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత దాదాపు 14.19 లక్షల హెక్టార్లలో రైతులు వరి పండించారు. 2015-16 లో 29.6 లక్షల టన్నులు, 2016-17 లో 51.7 లక్షల టన్నులు, 2017-18లో 62.5 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది.
సాగుకు ప్రాజెక్టులు..
కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ పథకం ద్వారా బావుల పునరుద్ధరణ తదితర వాటి ద్వారా 60 లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగు జరిగిందని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్టీసీసీఐ).. నివేదికలో వెల్లడించింది. రైతులకు 24 గంటల విద్యుత్ సదుపాయం కల్పించడంతో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని వివరించింది. ఖరీఫ్ సీజన్లో 47 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా.. యాసంగిలో 65 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలంగాణ పౌర సరఫరాల సంస్థ తెలిపింది. ఈ ఆరేళ్లలో ధాన్యం సేకరణలో 367 శాతం వృద్ధి సాధించినట్లు పేర్కొంది.
ఈ మేరకు 40 లక్షల టన్నుల వరకు ధాన్యాన్ని నిలువచేసేలా గిడ్డంగులతోపాటు నిర్వహణకు రైతు సంఘాలను ఏర్పాటు చేయాలని తాజా నివేదిక ప్రకారం సీఎం కేసీఆర్.. అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో పంట సాగు కోసం గోదావరి, కృష్ణా జలాల నుంచి 1,300 టీఎంసీల నీటిని వినియోగించే అవకాశం ఉందని పేర్కొన్నారు.