ఆంధ్రప్రదేశ్ విజయవాడ నగరంలోని ఆసుపత్రులను ఆక్సిజన్ కొరత వెంటాడుతోంది. నగరానికి చెందిన ఓ కరోనా బాధితుడికి.. శ్వాస సమస్యలు తలెత్తాయి. వెంటనే ఆసుపత్రిలో బెడ్ కోసం.. నగరంలోని పలు ఆసుపత్రులకు వెళ్లినా చేర్చుకునేందుకు నిరాకరించారు. ఆక్సిజన్ నిల్వలు తగినంతగా లేవని చెప్పి చేర్చుకోలేదు. చివరకు అతికష్టంపై సర్వజన ఆసుపత్రిలో బెడ్ దొరికింది.
అరకొరక నిల్వలు
కొవిడ్ వేగంగా విస్తరిస్తుండడంతో, దీని బారిన పడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వీరిలో శ్వాస సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్న వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కొవిడ్, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు అరకొరగానే ఉన్నాయి. పెరుగుతున్న రోగుల అవసరాలకు తగ్గట్లు సరఫరా లేదు. దీని వల్ల ప్రాణవాయువు ధరలకు రెక్కలొచ్చాయి. దీనిని సాకుగా చూపుతూ పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో రుసుములు కూడా పెంచేశారు.
గతంలో వంద... ఇప్పుడు మూడు వందలు!
గతంలో 5 కిలోల సిలిండర్ ధర రూ.100 ఉండగా.. ప్రస్తుతం రూ.300 అయింది. డిమాండ్ ఎక్కువ ఉండడంతో సరఫరాదారులు ధరలను అమాంతం పెంచేస్తున్నారు. విజయవాడ సర్వజన ఆసుపత్రిలో ప్రస్తుతం 20 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న సిలిండర్లు రెండు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం 213 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
అతికష్టం మీద సర్దుబాటు
పిన్నమనేని సిద్ధార్థ కొవిడ్ ఆసుపత్రిలో ప్రాణవాయువు 3 టన్నుల నిల్వ ఉందనీ.. ఇది రెండు రోజుల వరకు వస్తుందని నిర్వాహకులు చెపుతున్నారు. మచిలీపట్నంలోని జిల్లా ఆసుపత్రిలోని కొవిడ్ విభాగంలో రోగుల సంఖ్య పెరుగుతుండడంతో ఆక్సిజన్ నిల్వలు నిండుకుంటున్నాయి. ప్రస్తుతం అతి కష్టంపై సర్దుబాటు చేస్తున్నారు. సరిపడా ఆక్సిజన్ సరఫరా కాకపోవడంపై ఆందోళన నెలకొంటోంది. ఇప్పుడున్న రోగుల సంఖ్యను బట్టి రోజుకు 5వేల లీటర్ల ఆక్సిజన్ అవసరం ఉంది. సరిహద్దున ఉన్న గుంటూరు జిల్లా రేపల్లె నుంచి కూడా ఇక్కడికి చికిత్స కోసం వస్తున్నారు. ఆదివారం నాటికి మొత్తం 4వేల లీటర్ల మేర మాత్రమే నిల్వలు ఉన్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
కలెక్టర్ అత్యవసర సమావేశం..
కరోనా బాధితుల సంఖ్య పెరగటంతో ఆసుపత్రుల్లో మెడికల్ ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆక్సిజన్ కంపెనీలతో అత్యవసరంగా సమావేశమయ్యారు. జిల్లాలో ఆక్సిజన్ సరఫరా చేస్తున్న ఆరు కంపెనీల ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు తగ్గకుండా ఉంచేందుకు సాయం చేయాలని కోరారు. వ్యాపార ధోరణిలో కాకుండా సామాజిక సేవా థృక్పధంతో సరఫరా చేయాలని కోరారు. జిల్లాలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు సరిపడా ఆక్సిజన్ సమకూర్చాలన్నారు.
ఇదీ చదవండి:కొవిడ్ బాధితులకు ముచ్చెమటలు పట్టిస్తున్న విద్యుత్ కోతలు