హైదరాబాద్ కింగ్ కోఠిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మిస్తున్న ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్‌లో ప్రధానంగా ఐదు దశలు... అంటే ఎయిర్ కంప్రెజర్, ఎయిర్ డ్రయ్యర్, ఎయిర్ ట్యాంక్, ఆక్సిజన్ జనరేటర్, ఆక్సిజన్ ట్యాంక్ ఉంటాయి. తొలుత వాతావరణం నుంచి సహజంగా వస్తున్న వాయువును ఇందులోని ఎయిర్ కంప్రెజర్ తీసుకుంటుంది. తర్వాత ఆ వాయువును ఎయిర్ డ్రయ్యర్‌లోకి పంపుతుంది. అక్కడ నుంచి ఎయిర్ ట్యాంక్‌లోకి వెళ్తుంది. దీని నుంచి ఆక్సిజన్ జనరేటర్‌కు వెళ్లి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తారు. ఇలా నిమిషానికి 960 కిలోల ఆక్సిజన్‌ను సాధారణ వాయువు నుంచి ఉత్పత్తి చేస్తారు. లిక్విడ్ ఆక్సిజన్ వాడకాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుతం కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రిలో 13 వేల కిలోలీటర్ల ఆక్సిజన్ సామర్థ్యం కలిగిన లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ ఉంది. దీనిని నింపేందుకు ప్రతి రోజూ జడ్చర్ల నుంచి ఓ లారీ వస్తుంది. లిక్విడ్ ఆక్సిజన్‌ను కోట్లాది రూపాయిలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో ఆక్సిజన్ జనరేటర్లను నిర్మించుకునేందుకు బడ్జెట్ కేటాయించింది. దీంతో డీఆర్డీఓ శాఖ ఈ ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్స్ తయారీని టాటా కంపెనీకి అప్పజెప్పింది.