ప్రాణవాయువు కోసం కరోనా బాధితుల ఇబ్బందులు దయనీయంగా ఉన్నాయి. ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సన్‌ట్రేటర్ యంత్రాలు దొరకడంలేదు. అవసరం లేకున్నా చాలామంది ముందు జాగ్రత్తగా వాటిని కొని ఇంట్లో పెట్టుకోవటంతో అవసరమైన వారికి లభించని పరిస్థితి. ఒకటీ అరా దొరికినా ధరలు కొండెక్కాయి. గత నెల చివరివారంలో వినియోగం రోజుకు 350 టన్నుల వరకు ఉండగా ప్రస్తుతం 450 నుంచి 500 టన్నుల వరకు ఉంది. హైదరాబాద్‌లో రోజుకు 100 టన్నులే ఉత్పత్తి అవుతోంది. మిగిలింది కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి రప్పిస్తున్నారు.మూతపడిన రెండు ప్లాంట్లను తెరిచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వాటిద్వారా రోజుకు 80టన్నుల వరకు ఉత్పత్తి కానుంది.
ఆక్సిజన్ కొరత రాదు
రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత వచ్చే అవకాశం లేదు. ఆసుపత్రుల్లో సమస్యలు రాకుండా సాంకేతిక బృందాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నాం. ప్రస్తుతం సరఫరా సజావుగానే ఉంది. మరింతకోటాను పెంచాల్సిందిగా కేంద్రాన్ని కోరాం. కొన్ని దేశాల నుంచి విరాళాల రూపంలో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్ కేంద్రానికి అందుతున్నాయి. వాటిలో కొన్ని త్వరలో రాష్ట్రానికిచేరనున్నాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద కొంతమంది ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను ఆసుపత్రులకు అందచేస్తున్నారు.