పచ్చదనం ప్రకృతి ప్రేమికులను పరవశింపజేస్తే.. విభిన్న రకాలైన పుష్పాలు మనస్సుని పులకరింపజేస్తాయి. ఆస్వాదించే మనసు ఉంటే, ప్రకృతిలో మనం ఎన్నో అందాలను చూడవచ్చు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా ఉన్న పుష్పాల సోయగాలు.. నగరావాసులను మంత్రముగ్ధుల్ని చేసి ఆకట్టుకుంటున్నాయి. నిత్యం సందడిగా ఉండే నెక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్ పరిసరాలు.. ప్రకృతి అందాలతో సందర్శకుల మదిని దోచుకుంటున్నాయి.
ప్రకృతి ప్రేమికులైతే ఆహ్లాదకరమైన వాతావరణంతో అల్లుకుపోతున్నారు. రహదారికి ఇరువైపుల ఉన్న పచ్చదనం, ప్రకృతి అందాలు వీక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రోడ్లకు ఇరువైపులా వేసిన విభిన్న రకాల మొక్కలు, వాటి పువ్వులు.. అటుగా వెళ్లే వారి కళ్లను కట్టిపడేస్తున్నాయి. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో వాటి అందం మరింత రెట్టింపవుతోంది. సెలవులు, పండుగలు వస్తే.. నగరవాసులు వెంటనే నెక్లెస్‌రోడ్‌లో వాలిపోతారు. ఇక్కడ ఉన్న ప్రకృతి అందాలను ఆస్వాదిస్తారు. సాయంత్రం సమయాల్లో అయితే.. ఈ ప్రాంతాలు సందడిగా మారిపోతాయి. ఓ వైపు ప్రకృతి అందాలు, మరోవైపు చిన్నారుల ఆటపాటలతో ఆ ప్రాంతమంత కనులపండువగా మారుతోంది. వారాంతం సమయాల్లో అయితే.. ఇక్కడికి వచ్చేవారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటోంది.
ప్రకృతి అందాలకు వేదిక బాహ్యవలయ రహదారి: ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వివిధ ప్రాంతాల సందర్శనకు వెళ్తుంటాం. అలాంటి ప్రకృతి ప్రేమికులకు నెక్లెస్‌రోడ్, సాగర్ పరిసర ప్రాంతాలు, రహదారులు ఆ లోటును తీరుస్తున్నాయి. ఆ ప్రకృతి అందాలు.. చక్కటి ఆహ్లాదంతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తున్నాయి. భాగ్యనగర మణిహారం బాహ్య వలయ రహదారి ప్రకృతి అందాలకు వేదికైంది. వాహనాల రణగొణ ధ్వనులకు ఇరువైపులా.. అందమైన పూల మొక్కలు ఆహ్లాదానిస్తున్నాయి. పటాన్‌చెరు శివారు ఎగ్జిట్-3లో ఎక్కి గచ్చిబౌలి వైపు వెళ్తుంటే టెకోమా, అర్జెంటీయా, కబేరియన్ ట్రపెంట్ ట్రీ, బంగారు వర్ణపు చెట్లతో పసుపు రంగుల్లో పూలు ఆకట్టుకుంటున్నాయి.