Outer Ring Rail in Hyderabad :హైదరాబాద్ చుట్టూ 563.5 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రైలు మార్గం నిర్మాణానికి కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు నిర్మిస్తామన్న కిషన్ రెడ్డి.. ఈ ప్రాజెక్టుపై రైల్వే శాఖ కసరత్తు ప్రారంభించిందని తెలిపారు. ప్రాజెక్టు వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందించామన్నారు. ప్రతిపాదిత రీజనల్ రింగ్ రైలు మార్గం.. విజయవాడ హైవేలో చిట్యాల వద్ద, వరంగల్ రోడ్డులో రాయగిరి వద్ద, బెంగళూరు రోడ్డు మార్గంలో బూర్గుల వద్ద కలవనుంది. ముంబయి మార్గంలో వికారాబాద్ వద్ద, బాసర, నాందేడ్‌కు వెళ్లే మార్గంలో అక్కన్నపేట వద్ద కలవనుంది. అవన్నీ హైదరాబాద్‌కు 30 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో నగర రవాణా రంగానికి సరికొత్త దిశను చూపనుంది. ఆ ప్రాజెక్టు వల్ల ఇప్పటి వరకు రైలుమార్గం లేని చిట్యాల వంటి పట్టణాలకు కొత్తగా రైళ్లు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది.
Outer Ring Rail Project in Telangana : ప్రాజెక్టు కార్యారూపం దాలిస్తే.. హైదరాబాద్‌లోని రైల్వే స్టేషన్లపై ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. కొత్తగా మరికొన్ని రైళ్లు ప్రవేశపెట్టేందుకు వెసులుబాటు లభించడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గంగా మారనుంది. గూడ్స్, ప్రయాణికుల రైళ్లను.. హైదరాబాద్‌కు 50 నుంచి 60 కిలోమీటర్ల దూరం నుంచే మళ్లించవచ్చు. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు.. విజయవాడ, ముంబయి, కర్నూలు, వికారాబాద్, మెదక్, కరీంనగర్ ప్రధాన రహదారులను అనుసంధానిస్తుంది. ఆయా జంక్షన్లు లాజిస్టిక్ హబ్‌గా అభివృద్ధి అయ్యేందుకు అక్కడ కార్గో టెర్మినళ్లు నిర్మించే అవకాశం ఉంటుంది. ఆ ప్రాజెక్టు వల్ల ట్రాక్ సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది. ఔటర్ రింగ్ రైలు మార్గంలో ట్రాక్‌ను 200 కిలోమీటర్ల వేగానికి తట్టుకునేలా నిర్మించవచ్చు.
''ఓఆర్‌ఆర్‌పీ సర్వేకు కేంద్రం రూ.14 కోట్లు కేటాయించింది. సిటీకి రాకుండా సరిహద్దుల నుంచే వెళ్లేందుకు ప్రాజెక్టు ఉపయుక్తంగా ఉంటుంది. అనుసంధానం లేని ప్రాంతాలకు ప్రాజెక్ట్ ద్వారా అనుసంధానం చేస్తాం. వరంగల్ నుంచి కరీంనగర్‌కు రైల్వే లైన్ సర్వే ప్రారంభమైంది. ఎంఎంటీఎస్ రెండో దశ చేపట్టాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. రూ.330 కోట్లతో ఎంఎంటీఎస్ రెండో దశ చేపట్టాలని ప్రధాని ఆదేశించారు.''- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి