ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) మహిళా వసతి గృహంలో సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థినులు రోడ్డెక్కారు. ఆదివారం మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో లేడిస్ హాస్టల్ మెస్‌లో ఓ విద్యార్థినికి చికెన్ కర్రీలో పురుగు వచ్చిందని అక్కడున్న సిబ్బందిని నిలదీశారు. అయితే, వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో విద్యార్థినులంతా కలిసి వసతిగృహం ముందు రోడ్డుపై బైఠాయించారు.
ఉన్నత చదువుల కోసం తాము ఓయూకు వస్తే ఇక్కడ టాయిలెట్లు కూడా సరిగా లేవని, మంచి నీటి సౌకర్యం లేదని, నాణ్యమైన ఆహారం కూడా అందించడంలేదని వాపోయారు. మౌలిక సదుపాయాలు కల్పించకపోతే ఎలా చదువుకుంటామని ప్రశ్నించారు. నాణ్యమైన ఆహారం అందించాలని, నీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం 3.30 గంటల నుంచి రాత్రి 8.30 వరకు ఆందోళన కొనసాగింది. పోలీసులు నచ్చజెప్పడంతో శాంతించిన విద్యార్థినులు ఆందోళన విరమించారు.