అక్రమ వడ్డీ వ్యాపారస్తులకు మంత్రి గంగుల కమలాకర్ వత్తాసు పలుకుతున్నారని.. కరీంనగర్లో ఆయన అనుచరులైన పలువురు వ్యాపారులు తన భూమిని లాక్కున్నారని హన్మకొండకు చెందిన సమ్మయ్య ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఓయూ జేఏసీ, పౌరహక్కుల ప్రజా సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి గంగుల కమలాకర్ భూ కబ్జాలు, అక్రమ వడ్డీ వ్యాపారానికి గురైన బాధితుల ఆవేదన గురించి జయ వింధ్యాల మాట్లాడారు.
'భూ కబ్జాలకు పాల్పడుతున్న ఆ మంత్రిపై చర్యలు తీసుకోవాలి'
అక్రమ వడ్డీ వ్యాపారులకు మంత్రి గంగుల కమలాకర్ అండగా ఉంటూ.. భూకబ్జాలకు పాల్పడుతున్నారని పౌరహక్కుల ప్రజా సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ జయ వింధ్యాల ఆరోపించారు. ఉస్మానియా వర్సిటీలో ఓయూ జేఏసీ, పౌరహక్కుల ప్రజా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
వడ్డీ వ్యాపారుల నుంచి సమ్మయ్య తీసుకున్న అప్పు తిరిగి చెల్లించినప్పటికీ తన భూమి పత్రాలు ఇవ్వలేదని... ఆపై భూమిని ప్లాట్లుగా మార్చి అమ్మేశారని ఆమె తెలిపారు. ఈ విషయంపై వాళ్లను నిలదీయగా.. మేము మంత్రి గంగుల అనుచరులమని బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి.. భూ అక్రమాలకు పాల్పడుతున్న మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. సమ్మయ్యకు అన్యాయం చేస్తే ఊరుకోమని ఓయూ జేఏసీ నాయకుడు అశోక్ హెచ్చరించారు.
ఇదీ చూడండి:'తెలంగాణ ఏర్పడిన తర్వాత స్వర్ణయుగం వచ్చింది'