Ou Doctorate to CJI:సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదాన చేసింది. ఓయూ 82వ స్నాతకోత్సవంలో గవర్నర్ తమిళిసై చాన్సలర్ హోదాలో సీజేఐ జస్టిస్ రమణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. దేశంలోని ఉన్నత విద్యలో కొత్త శకాన్ని సృష్టించి.. ఆధునిక భారతదేశ నిర్మాణంలో భాగస్వామ్యమైన ఉస్మానియా యూనివర్సిటీ ఎంతో మంది మేధావులను తయారు చేసిందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. పీవీ వంటి ప్రధాని, కేసీఆర్ లాంటి సీఎం సహా మంత్రులు, నేతలను ఓయూ అందించిందన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్, జవహర్ లాల్ నెహ్రూ, అంబేడ్కర్ వంటి 42 మంది సరసన... ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోవడం తాను సరిపోతానా అని భయపడ్డానని జస్టిస్ రమణ అన్నారు. ఓయూ హాస్టళ్లు, క్యాంటీన్, గ్రంథాలయాల్లో స్నేహితులతో కలిసి గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాయం గ్లోబల్ లెర్నింగ్ సెంటరని.. సామాజిక సమతుల్యతకు, భిన్న నేపథ్యాలున్న విద్యార్థులకు వేదిక అని అభివర్ణించారు. సామాజిక మార్పు, మరింత సమానత్వం కోసం విద్యార్థుల్లో ఆలోచన రేకెత్తించిన కేంద్రమన్నారు. రాష్ట్రంలోని భిన్నత్వం, విలువైన సంప్రదాయాలకు ఓయూ ప్రతిబింబమన్నారు. భారతదేశం వంటి ప్రజాస్వామిక దేశాల్లో విశ్వవిద్యాలయాలు జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు.
విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థలో విద్య, సమాచారమే వ్యక్తులకు కీలకమైన ఆస్తి. నాణ్యమైన విద్య, కష్టపడేతత్వం, అంకితభావంతో ఎవరైనా సామాజిక అడ్డుగోడలను బద్దలు కొట్టవచ్చు. సామాజిక అభివృద్ధికి విద్య కీలక పునాది. చట్టాల పట్ల విద్యార్థులు కనీస జ్ఞానం కలిగి ఉండాలి. రాజ్యాంగంతో ప్రజలు అనుసంధానం కావాలి. ఎందుకంటే అదే మనకు అంతిమ రక్షణ కవచం. రాజ్యాంగం, సుపరిపాలన అంశాలపై పాఠ్యాంశాలను ప్రవేశపెట్టడానికి ఇదే కీలక సమయం. - జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి