Suggestions on Engineering Education:తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థులు యూజీ స్థాయిలో ఇంజినీరింగ్ కోర్సులోనే చేరుతున్నారు. మేటి భవిష్యత్తుకు బాటలు వేస్తుందనే నమ్మకంతో తల్లిదండ్రులూ ఈ విద్యను ప్రోత్సహిస్తున్నారు. బీటెక్ విద్యార్హతతో చాలామంది 3, 6, 10, 12.. లక్షల వార్షిక ప్యాకేజీలతో కాలేజీ నుంచి క్యాంపస్‌లోకి అడుగుపెడుతున్నారు. అలాగే పది, పన్నెండు వేల నెల జీతంతో నెట్టుకొస్తున్నవాళ్ల సంఖ్యా తక్కువ కాదు. ఎక్కువ ప్యాకేజీతో అవకాశం వచ్చినవాళ్లు మరింత ముందుకెళ్తున్నారు. తక్కువ వేతనం పొందుతున్నవారు మెరుగైన స్థాయిని చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎందుకింత వ్యత్యాసం?: ఆ నాలుగేళ్లూ బాగా చదివుంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదని.. తక్కువ జీతంతో నెట్టుకొస్తున్నవాళ్లంతా మధనపడుతుంటారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే పెద్దగా ప్రయోజనం దక్కకపోవచ్చు. అయితే వీరంతా నేటి విద్యార్థులకు ఒక కేస్ స్టడీలాంటివారు. తమ కెరియర్ ఇలా ఉండకూడదని భావిస్తే.. ప్రథమ సంవత్సరం నుంచే తమ ప్రయాణాన్ని మెరుగైన రీతిలో మొదలుపెట్టి కొనసాగించాలి. లేదంటే రాజీపడుతూ, అసంతృప్తితో కెరియర్ కొనసాగుతుంది.
ఇష్టంతో కష్టపడితే:కొంతమంది ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు పొందలేకపోవచ్చు. కారణం ఏదైనప్పటికీ.. పేరున్న, కోరుకున్న కళాశాలలో సీటు పొందలేకపోవచ్చు. ఇలాంటివారు నిరాశ చెందకుండా ఈ నాలుగేళ్లూ సద్వినియోగం చేసుకుంటే అందరితోనూ సమానంగా లేదా అంతకంటే మెరుగ్గానే రాణించవచ్చు. ఉద్యోగం, ఉన్నత విద్య ఎందులోనూ.. ఐఐటీ లేదా ఎంసెట్‌లో పొందిన ర్యాంకును పరిగణనలోకి తీసుకోరు. ఈ పరీక్షల్లో విజయవంతమైనవాళ్లు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకుంటే మంచిది. చాలా సందర్భాల్లో పూర్వ విజేతలు కొందరు పరాజితులవుతున్నారు.
పాత విజయాన్ని ఆస్వాదిస్తూ, ఇక తిరుగులేదని భావిస్తున్నారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్లు, గేట్ ర్యాంకులు, జీఆర్‌ఐ స్కోరు ఇలా ప్రతి విషయంలోనూ చిన్న కళాశాలల్లో చదువుకున్న విద్యార్థులు రాణిస్తున్నారు. అందువల్ల పెద్ద ర్యాంకు వచ్చినవారు తమనితాము తక్కువగా అంచనా వేసుకోకూడదు. సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే విజేతలు కావచ్చు. టాపర్లను దాటి వీరు ముందుకెళ్లడానికి నాలుగేళ్ల వ్యవధి బాగా సరిపోతుంది. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికీ, మెరుగుపడటానికీ ఈ సమయం చాలా ఎక్కువ.
ఒకవేళ ఫ్యాకల్టీ చెప్పింది అర్థం కాకపోయినా చింతించాల్సిన పనిలేదు. ఎన్‌పీటీఈఎల్ పోర్టల్ ద్వారా ఐఐటీ ప్రొఫెసర్ల పాఠాలు వినవచ్చు. గేట్ లాంటి మేటి పరీక్షలకూ సన్నద్ధం కావచ్చు. మనం కోరుకున్న ప్రతి అంశాన్నీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఉచితంగా ఎన్నో వేదికల ద్వారా పొందవచ్చు. చాలా సంస్థలు ప్రాంగణాల్లో ఉచితంగా వైఫై అందిస్తున్నాయి. తక్కువ ధరకే ఇంటర్నెట్ వీక్షించవచ్చు.
వెలుగూ...చీకటీ:ఇంజినీరింగ్ విద్య ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల కుటుంబాలు ఉన్నస్థానం నుంచి ఉన్నత స్థానానికి చేరుకోవడంలో ఇంజినీరింగ్ విద్యే మెరుగైన పాత్ర పోషిస్తోంది. అయితే కొందరు విద్యార్థులు చెడుస్నేహాలు, వ్యసనాలు, ఆన్‌లైన్ క్రీడలు, డ్రగ్స్, బెట్టింగులతో తమ జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకోవడం చూస్తున్నాం. వీరి తప్పులతో ఏ మాత్రం సంబంధం లేని తల్లిదండ్రులు దోషుల్లా సమాజంలో నిలబడాల్సివస్తోంది. అందువల్ల ఏ పని చేయాలన్నా.. ఒకసారి మీ అమ్మ, నాన్న, సోదరి, సోదరుడు, బంధువులు, గౌరవించే, ప్రేమించే వ్యక్తులు.. వీరందరినీ గుర్తుకుతెచ్చుకోండి. తల్లిదండ్రులను తలెత్తుకునేలా చేస్తే సంతోషమే. అలా చేయడం వీలుకాకపోయినా వారిని తల దించుకునేలా మాత్రం చేయకూడదని గుర్తుంచుకోవాలి.
ఎన్నో దారులు:బీటెక్ అనంతరం ఎంటెక్, ఎంబీఏ కోర్సులు, విదేశీ విద్య, కార్పొరేట్ కొలువులు, ప్రభుత్వ ఉద్యోగాలు...ఇలా ఎన్నో మేటి మార్గాలు ఉన్నాయి. అయితే గమ్యం ఎటువైపో నిర్ణయించుకోవాల్సింది విద్యార్థులే. బలాలు, ఆసక్తులు, ఆశయాలు, అవసరాలు, ఆర్థిక నేపథ్యం... అన్నీ పరిగణనలోకి తీసుకుని.. సరైన నిర్ణయానికి వస్తే విజయం దిశగా తొలి అడుగు పడినట్లే. ఈ క్రమంలో స్వీయసమీక్షను మించిన కొలమానం లేదు. నచ్చినమార్గాన్ని ఎంచుకున్నవారికి మెచ్చిన అవకాశాలు సొంతమవుతాయి.
బోధన, పరిశోధనలకు:టెక్నికల్‌గా మరింత పరిజ్ఞానం పొందాలని కోరుకునే బీటెక్ విద్యార్థులు ఎంటెక్‌లో చేరితే ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు ఎంటెక్+పీహెచ్‌డీ ఇంటిగ్రేటెడ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బోధన, పరిశోధన రంగాల్లో రాణించడానికి ఈ కోర్సులు అనువైనవి. గేట్ ద్వారా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీలు, ప్రముఖ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఇంజినీరింగ్ పీజీ కోర్సులు పూర్తిచేసుకోవచ్చు.
గేట్‌లో అర్హత సాధించినవారు ఎంటెక్‌లో రెండేళ్లపాటు ప్రతినెలా రూ.12,400 స్టైపెండ్ కూడా అందుకోవచ్చు. గేట్‌లో అర్హులు కానివాళ్లు పీజీఈసెట్ ద్వారా రాష్ట్రస్థాయి ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరొచ్చు. అయితే బీటెక్‌లా కాకుండా ఎంటెక్ మాత్రం వీలైనంతవరకు మేటి సంస్థలోనే చదవడానికి ప్రయత్నించాలి. ఇలా జరిగినప్పుడే ఆ పీజీకి విలువ పెరుగుతుంది. కేవలం అర్హత పెంచుకోవడానికి ఎంటెక్ పూర్తిచేయడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ దక్కదు.