కరోనా బాధితులు తగ్గినపుడే గాంధీలో ఇతర వైద్య సేవలు - Hyderabad Latest News
గాంధీలో సాధారణ చికిత్సలు ఎప్పుడు? ఇదే అంశం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. కరోనాతోపాటు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో దఫదఫాలుగా మిగతా సేవలు ప్రారంభమవుతాయని మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించిన నేపథ్యంలో గాంధీలో కూడా సాధారణ సేవలకు మార్గం దొరుకుతుందని భావిస్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు కష్టమని గాంధీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
కరోనా బాధితులు తగ్గినపుడే గాంధీలో ఇతర వైద్య సేవలు
By
Published : Oct 5, 2020, 2:36 PM IST
|
Updated : Oct 5, 2020, 3:36 PM IST
గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం 1890 పడకలు ఉన్నాయి. 613 మంది చికిత్స పొందుతున్నారు. నిత్యం అన్ని ప్రాంతాల నుంచి కరోనా రోగులు వస్తున్నారు. పరిస్థితి తీవ్రమైన వారు ఎక్కువ శాతం చేరుతున్నారు. ప్రస్తుతం ఐసీయూలో 500 పడకలు ఉంటే 428 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో వంద మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ తరుణంలో కరోనాతోపాటు సాధారణ చికిత్సలు పునరుద్ధరించడం కొంత ఇబ్బందే. కరోనా బాధితుల సంఖ్య 300 అంతకంటే ఇంకా తగ్గితే సాధారణ చికిత్సలకు కూడా అనుమతించే వీలు ఉంటుందని గాంధీ వర్గాలు పేర్కొంటున్నారు.
ఎదురు చూపులు
మార్చి నుంచి గాంధీ ఆసుపత్రిని పూర్తిగా కొవిడ్ సేవల కోసం కేటాయించిన సంగతి తెలిసిందే. వైద్యులు, వైద్య విద్యార్థులు, పీజీ విద్యార్థులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు ఇతర నాలుగో తరగతి సిబ్బందిని పూర్తిగా కరోనా సేవలకే కేటాయించారు. ఎంబీబీఎస్ చదివే వైద్య విద్యార్థులు, హౌస్ సర్జన్‌లు, వివిధ ప్రత్యేక కోర్సుల కోసం చేరిన పీజీ వైద్య విద్యార్థులు సైతం ఆరు నెలలుగా కరోనా సేవల్లో తలమునకలై ఉన్నారు.
ఇతర సేవలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు
గాంధీ మొత్తం కొవిడ్ సేవలకు కేటాయించడం కారణంగా ఇతర చికిత్సలు నిలిచిపోయాయి. ఇతర సేవలు అందుబాటులో లేక పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందరూ ఉస్మానియాకు వెళ్లడం కారణంగా అక్కడ విపరీత రద్దీ పెరుగుతోంది. ఈ విషయమై గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావును ‘ఈనాడు’ సంప్రదించగా కరోనాతోపాటు ఇతర సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. దీనిపై ఆయా విభాగాధిపతులతో కలిపి కమిటీ ఏర్పాటు చేశామన్నారు.