ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రూ.10 కోట్లతో సెంటర్ ఫర్ ప్రొడక్ట్ డిజైన్ డెవలప్మెంట్ అండ్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఇక్కడ జర్మనీ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన మూడు త్రీడీ ప్రింటింగ్ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ కేంద్రంలో కొన్ని నెలలుగా కృత్రిమ అవయవాల(Artificial organs with 3D) తయారీపై పరిశోధనలు చేపట్టారు. ఇప్పటికే పక్కటెముకలు, మోకాలు చిప్పలు, దంతాల సేఫ్గార్డులు వంటివి విజయవంతంగా తయారు చేశారు. ఇందుకోసం అల్యూమినియం, నికెల్, స్టీల్ వంటివి వినియోగిస్తున్నారు.
తుది దశకు..
దేశంలో తొలిసారిగా త్రీడీ సాంకేతికతను వినియోగించి కృత్రిమ గుండె(Artificial organs with 3D) తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకోవడంతో ప్రయోగాలు చేపట్టారు. ఇదిలా ఉండగా డీఆర్డీవోతో కలిసి రక్షణ రంగంలో వినియోగించే పరికరాలకు తక్కువ బరువుతో కూడిన ఉత్పత్తులను తయారు చేయనున్నారు. ఇందుకోసం రూ.20 లక్షల విలువైన ప్రాజెక్టులు చేసేందుకు డీఆర్డీవోతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయ మెకానికల్ విభాగంలో ఇంజినీరింగ్ ఆచార్యుడు, 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ డైరెక్టర్ శ్రీరామ్ వెంకటేష్ చెప్పారు. అలాగే ఈ ఏడాది నుంచి ఇంజినీరింగ్ చదివే విద్యార్థులకు సైతం ఓపెన్ ఎలెక్టివ్ సబ్జెక్టుగా 3డీ ప్రింటింగ్ టెక్నాలజీని ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు.
మొత్తం రూ.10కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసి.. నామకరణం చేశాం. అదే సెంటర్ ఫర్ ప్రోడక్ట్ డిజైన్ డెవలప్మెంట్ అండ్ అడిటివ్ మ్యానుఫాక్చరింగ్. ఈ సెంటర్లో ఇప్పటికే కొన్ని కృత్రిమ అవయవాలు తయారుచేశాం. భవిష్యత్లో మరిన్ని తయారుచేస్తాం.
-శ్రీరామ్ వెంకటేష్, ప్రొఫెసర్