UCEOU Placements 2023 : ఇంజినీరింగ్ అయిపోయన విద్యార్థులు ఎలాగైనా మంచి కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించాలనే తపనతో ఉంటారు. ఈ క్రమంలో ఉద్యోగార్థులు ఎన్నో సంస్థలకు రెజ్యూమెలు పంపుతూ ఉంటారు. కొన్నిసార్లు సమాధానం రాక.. ఎందుకు రాలేదో తెలియక ఇబ్బంది పడుతుంటారు. మరోపక్క అనేక సంస్థలు... సమర్థులైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తుంటాయి. ప్రధానంగా ఇంజినీరింగ్ అభ్యర్థులకు అదనంగా హార్డ్, సాఫ్ట్ స్కిల్స్ రెండూ ఉండాలి. అప్పుడే ఆ విద్యార్థి మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో స్థిరపడతారు.
Highest Placements in OU Engineering College : వీటికి తోడు ఓ మంచి కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం సంపాదించాలంటే ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో చదవాలి. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపిక కావాలి. అప్పుడే రూ.లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వస్తుందనే భ్రమలో పడి కొంతమంది విద్యార్థులు మధ్యలోనే తమ చదవుకు పుల్‌స్టాప్ పెడుతున్నారు. ఇందుకు భిన్నంగా ప్రముఖ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలకు దీటుగా ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాలఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. కంప్యూటర్, ఐటీ కోర్సులు చదువుకుంటున్న విద్యార్థులంతా బహుళ జాతి సంస్థల్లో ఏటా రూ.లక్షల వేతన ప్యాకేజీలు పొందుతున్నారు.
ఐటీ కోర్సులే కాకుండా ఇతర కోర్సుల్లోనూ ప్లేస్‌మెంట్లు :గతేడాది ఇదే కళాశాలలో చదువుకున్న ఒక విద్యార్థికి మాథ్ వర్క్ అనే బహుళ జాతి సంస్థ రూ.24 లక్షల వార్షిక వేతనాన్ని ఆఫర్ చేసింది. అలాగే 66 మందికి రూ.పది లక్షలు, ఆపై వేతన ప్యాకేజీలు లభించాయి. వంద శాతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న కళాశాలగా ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాలకు ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తించింది. కంప్యూటర్, ఐటీ కోర్సులే కాకుండా ఇతర కోర్సుల్లో 80 శాతం మందికి ప్లేస్‌మెంట్లు లభిస్తున్నాయి.