bariatric surgery in Osmania hospital : అధిక బరువుతో బాధపడుతున్న యువకుడికి ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు బేరియాట్రిక్ సర్జరీతో ఉపశమనం కలిగించారు. హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ ప్రాంతానికి చెందిన మహేందర్ సింగ్(24) చిన్నతనం నుంచే ఊబకాయంతో చాలా బాధపడుతున్నారు. అతని వయసుతో పాటు అతని బరువు కూడా పెరుగుతూ వచ్చింది. నడవడం కూడా కష్టంగా మారింది.
తమ కుమారుడిని ఎలాగైనా బరువు తగ్గేలా చేయాలని అతడి తల్లిదండ్రులు ఉస్మానియా వైద్యులను సంప్రదించారు. పదిహేను మందితో కూడిన వైద్య బృందం శస్త్ర చికిత్స చేసి దాదాపు 70కిలోల బరువు తగ్గించినట్లు ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేందర్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ తరహా సర్జరీ చేయడం ఇదే తొలిసారి అని అన్నారు.
ఎంత మంది ఈ సర్జరీ చేశారు: ప్రైవేట్ ఆస్పత్రులకు మహేందర్ సింగ్‌ను తీసుకెళ్లిన తల్లిదండ్రులకు సర్జరీ కోసం రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. డబ్బుల సమస్యతో చివరికి వారు ఉస్మానియా వైద్యులను సంప్రదించారు. అతడిని పరీక్షించి.. సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఎండోక్రైనాలజీ, అనస్తీషియా విభాగాలకు చెందిన 15 మంది వైద్యులు యువకుడికి బేరియాట్రిక్ సర్జరీ చేయాలని నిర్ణయించారు. గ్యాస్ట్రిక్ బైపాస్ ద్వారా పొట్ట పరిమాణం తగ్గించడంతో పాటు, ఎక్కువ ఆహారం తీసుకోకుండా నియంత్రించేందుకు ఆహారం స్వీకరించే చిన్నపేగును కూడా తగ్గించారు. బాలుడు ఆపరేషన్ చేయక ముందు 220 కిలోల బరువు ఉండేవాడు. బేరియాట్రిక్ సర్జరీ తరవాత 70 కేజీలు తగ్గి 150 కేజీలకు చేరుకున్నట్లు వైద్యులు తెలిపారు.
సర్జరీ సమయంలో వైద్యులు పడిన ఇబ్బందులు: అధిక బరువుతో మహేందర్ మోకాళ్లపై భారం పడటం, మధుమేహం, అధిక రక్తపోటు, ఇతర శారీరక, మానసిక రుగ్మతలకు కారణమవుతున్నందున ఉస్మానియా వైద్యులు మానవీయ కోణంలో స్పందించి ఆ యువకుడికి కొత్త జీవితాన్ని అందించారు. సర్జరీ సమయంలో పలు ఇబ్బందులు ఎదురైనట్లు వైద్యులు తెలిపారు. మహేందర్ దాదాపు 220 కేజీల బరువు ఉండటంతో ఆపరేషన్ టేబుల్‌పై పడుకోబెట్టడం కూడా కష్టంగా మారిందని వైద్యులు చెప్పారు. శరీరానికి రెండువైపులా అదనపు బల్లలు ఏర్పాటు చేసి సర్జరీ పూర్తి చేశామని తెలిపారు. సర్జరీ తరువాత కూడా విటమిన్, పోటిన్ డైట్‌తో పాటు మజిల్ వ్యాయామం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సర్జరీ చేసిన వైద్యులను అభినందించారు.
ఉస్మానియా వైద్యులతో ఈటీవీ భారత్ ఇంటర్వ్యూ ఇవీ చదవండి: