Vechicles Speed increase on ORR by 120 kmph : భాగ్యనగరాలని మణిహారంగా భావించే.. ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాల ప్రయాణ వేగాన్ని పెంచుతున్నట్లు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ వెల్లడించారు. ఓఆర్ఆర్పై ఇక నుంచి గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్లొచ్చని ట్విటర్ ద్వారా తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డుపై భద్రత పరమైన అంశాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, ఓఆర్ఆర్ అధికారులు హాజరయ్యారు. గతంలో ఓఆర్ఆర్పై గరిష్ఠంగా 100 కిలోమీటర్ల వేగానికి అనుమతి ఉండేది.. ఓఆర్ఆర్పై ప్రయాణికుల కోసం మరిన్ని భద్రత చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అయితే ఇప్పుడు ఓఆర్ఆర్పై 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు నడవడం అనేది చర్చకు దారి తీసే అవకాశం ఉంది. ఎందుకంటే 100 కిలోమీటర్ల వేగంతోనే వాహనాలు వెళితేనే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి.. మరి ఇప్పుడు 120 కిలోమీటర్ల వేగంతో వెళితే ఏంటి పరిస్థితి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఓఆర్ఆర్పై నిబంధనలు కరవు : భాగ్యనగరం చుట్టూ మణిహారంగా ఉన్న ఔటర్ రింగురోడ్డుపై ప్రయాణం ప్రాణ సంకటంగా మారుతోంది. వేగం కన్నా ప్రాణం మిన్న అని తెలిసిన వారంతా కూడా వేగంగా నడుపుతూనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ బాహ్య రహదారి పొరుగు రాష్ట్రాలకు, జిల్లాలకు సాఫీగా చేరేందుకు 158 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. నిత్యం రెండు లక్షల వాహనాలు ఈ అవుటర్ రింగ్ రోడ్డుపై రాకపోకలు సాగిస్తాయని అంచనా. అలాగే నిత్యం ఏదో ఒక ప్రమాదం ఓఆర్ఆర్పై జరుగుతూనే ఉంటుంది. ఇలా ఏడాదికి 300 నుంచి 350 వరకు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసుల రికార్డుల లెక్కల్లో ఉన్నాయి.
Speed Increase On ORR 120 kmph : ఇప్పుడు ఓఆర్ఆర్పై వాహనాల గరిష్ఠ వేగాన్ని 100 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్లకు పెంచిన.. తర్వాత దీని కోసం ప్రత్యేకమైన నిబంధనలను యాజమాన్యం ఏర్పాటు చేయాలి. లేకపోతే ఏ రీతిలో ప్రమాదాలు జరుగుతాయో.. ఊహించలేము. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కొన్ని ప్రత్యేకమైన ప్రవేశ మార్గాల వద్ద నిబంధనలపై అవగాహన కల్పించడం లేదని వాహనదారులు ఫిర్యాదు చేస్తున్నారు. గత లెక్కలు తీసుకుంటే 19 రహదారి ప్రవేశమార్గాల్లో ఎక్కడా కనీసం నిబంధనలు అనేవి కనిపించవని చెబుతున్నారు. గతంలో పోల్చితే పోలీసుల గస్తీ, స్పీడ్ లేజర్ గన్ల నిఘాతో.. వాహనాల వేగానికి భారీగానే కళ్లెం వేశారు. ఇదే తరహాలో ఇప్పుడు కూడా మెరుగైన అత్యాధునికమైన టెక్నాలజీలను ఉపయోగించి.. వాహనాల ప్రమాదాలకు కళ్లెం వేస్తే మంచి పరిణామమే.
ఇవీ చదవండి :