తెలంగాణ

telangana

By

Published : Dec 4, 2019, 5:23 AM IST

Updated : Dec 4, 2019, 7:15 AM IST

ETV Bharat / state

భయం... భయంగా బాహ్యవలయం

రాజధాని హైదరాబాద్​లో నిఘా నేత్రం వట్టిదేనని తేలిపోయింది. 24 గంటలు పూర్తి భద్రత మధ్య మహిళలు, ప్రజలు స్వేచ్ఛగా జీవించవచ్చంటూ... చేస్తోన్న ప్రకటనలు కేవలం గాలి మాటలుగానే మిగులుతున్నాయి. ఎక్కడ ఏమి జరిగినా క్షణాల్లో తమ దృష్టికి వస్తుందని, ఐదు నిమిషాల లోపే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుంటారంటూ... ఆర్భాటపు ప్రకటనలు ఆచరణలో కనిపించటం లేదు. జంటనగరాల చుట్టుపక్కలనే కాదు... ప్రధాన నగరంలో కూడా కొన్ని వందల చోట్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి.

orr-position-in-hyderabad
భయం... భయంగా బాహ్యవలయం

భయం... భయంగా బాహ్యవలయం

జంటనగరాల్లో భద్రతపై 'దిశ' హత్యోదంతంతో దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్షల మంది ఐటి ఉద్యోగులు రాత్రింబవళ్లు పనిచేస్తున్న నగరంలో ముఖ్యంగా మహిళల రక్షణపై పోలీసుల చర్యలు నీటి మూటలుగా తేలాయి. టోల్‌గేట్‌కు కూతవేటు దూరంలో ఘోరం జరిగినా.... కనీసం గుర్తించలేకపోవటం ఆర్భాటపు ప్రకటనలను వెక్కిరిస్తున్నాయి. వరుస ఘటనలతో మహిళలు ధైర్యంగా బయటకు వెళ్లాలంటేనే హడలిపోయే దుస్థితి నెలకొంది. రాత్రి 7 దాటిందంటే సిటీలోకి వచ్చే రహదారులన్నీ భయంకరంగా మారుతున్నాయి.

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డా

బాహ్యవలయ రహదారి హైదరాబాద్ నగరానికే తలమానికం. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వేల సంఖ్యలో వాహనాలు నగరం లోపలికి రాకుండా బయట నుంచే వెళ్లిపోయే విధంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. 158 కిలోమీటర్లు ఉండే ఈ రహదారి ఇప్పుడు అనేక అసాంఘిక, హింసా కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. బాహ్య వలయ రహదారిపై శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వరకూ మాత్రమే హైవే పెట్రోలింగ్, ట్రాఫిక్ పెట్రోలింగ్, పర్యవేక్షణ, విద్యుత్ దీపాలు ఉన్నాయి. శంషాబాద్ నుంచి విజయవాడ వైపు రహదారి.. దాని పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డుపై వెళ్లే వాళ్లు ప్రాణాలు అరచేత పెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది. కటిక చీకటి.. రోడ్డుపై ఏ దోపిడీ దొంగలు ఉంటారోనని సామాన్య ప్రజలు భయాందోళనకు గురవుతన్నారు. ఈ ఆందోళన దిశ ఘటన తర్వాత మరింత ఎక్కువైంది.

మద్యం షాపులకు అడ్డా...

బయటి ప్రాంతాల నుంచి నగరంలోకి ప్రవేశించాలంటే రాత్రి పది గంటల వరకు ఆగాల్సిందే. ఇలా నగరంలోకి వచ్చే టోల్ బూత్ వద్ద తాజాగా చాలా బార్లు, వైన్స్​లు వెలిశాయి. దూర ప్రాతాల నుంచి టోల్ బూత్​లకు ముందుగానే చేరుకునే లారీలకు ఈ బార్లు, మద్యం దుకాణాలు అడ్డాలుగా మారుతున్నాయి. రాత్రి వరకూ తాగి అక్కడే భోజనం చేసి మెల్లగా రాత్రి నరగంలోకి వస్తున్నారు. సిటీలో రాత్రి 10 గంటల తర్వాత ట్రాఫిక్ పోలీసులు గానీ ఆర్టీఏ అధికారులు గానీ కనిపించరు. తాగి వాహనాలు, లారీలు నడుపుతున్న వారిని ఆపే వారే ఉండరు. ఇలా మద్యం మత్తులో వాహనాలు నడిపి చాలా మంది అమాయకుల మరణాలకు కారణం అవుతున్నారు.

ఇప్పటికైనా బాహ్య వలయ రహదారిపై పూర్తి స్తాయిలో పర్యవేక్షణ అవసరం. ఘటన జరిగినపుడు అయ్యో అనడం కంటే ముందుగా తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలావరకూ దిశ లాంటి ఘటనలకు అడ్డుకట్టవేయవచ్చునని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ఇవీచూడండి: విద్యార్థినులకు 3నెలల పాటు మార్షల్‌ ఆర్ట్స్ శిక్షణ

Last Updated : Dec 4, 2019, 7:15 AM IST

ABOUT THE AUTHOR

...view details