తోబుట్టువుల ప్రేమ... బంధువుల ఆదరణకు నోచుకోని నిర్భాగ్యులు ఆ చిన్నారులు. సమాజం వారిని ముద్దుగా అనాథలని పిలుస్తున్నా.. చూసిన ప్రతి వారు అయ్యే పాపం అంటున్నారే తప్ప ఆదుకునే నాథుడే కరవయ్యాడు. తమకంటూ ఓ అడ్రస్ లేని ఆ బాలలు ... బతికున్నామనేందుకు నిదర్శనంగా ఆధార్ పొందే అవకాశం లేకపోవటం బాధాకరం. దేశంలో నానాటికీ అనాథలు పెరిగిపోతున్నా.. వారికోసం ప్రత్యేకంగా ఎలాంటి చట్టాలు లేకపోవటం దురదృష్టకరం.
ఇంట్లో పరిస్థితుల కారణంగా రోడ్డున పడ్డవారు కొందరు. ఇష్టం లేకుండానే భూమి మీదకు వచ్చే వారు మరికొందరు. అనుకోని ఘటనల్లో అయినవారిని కోల్పోయి ఆప్తుల నీడ దొరకని వారు ఇంకొందరు. అమ్మ లేక... కొందరు... తండ్రి చనిపోయి ఇంకొందరు... ఇదీ ఆ బ్రహ్మ ఆడే 'అనాథ'ల జీవిత ఆట!
బాల్యం నుంచే బందీలుగా...
అనాథలు అసాంఘిక శక్తుల చేతిలో బాల్యం నుంచే బందీలుగా మారిపోతున్నారు. రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు, పాడుబడ్డ శిథిల గృహాలే వీరికి ఆవాసాలు. ఒంటరి జీవితాలు గడుపుతున్న వీరిని కొందరు చేరదీసి ‘యాచక’ వ్యాపారంతో పాటు పలు రకాల అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. ఫలితంగా రేపటి సమాజానికి వారధులు కావాల్సిన వీరు నేర ప్రపంచానికి చేరువ అవుతున్నారు.