ఏపీ ఏలూరులో వింత మూర్ఛ వ్యాధికి గల కారణాలు వైద్య నిపుణులకూ అంతుచిక్కడం లేదు. వరుసగా మూడో రోజూ జాతీయ పరిశోధనా సంస్థల నిపుణులు రోగుల రక్త నమూనాలతో పాటు... పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఆహార పదార్థాల నమూనాలను సేకరించారు. ఏలూరుకు సరఫరా అవుతున్న నీటి వ్యవస్థను పరిశీలించి.. నమూనాలను తీసుకున్నారు. డబ్యూహెచ్‌వో ప్రతినిధి బృందంతో పాటు ఎన్సీడీసీ, పుణే వైరాలజీ ల్యాబ్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ తదితర సంస్థలకు చెందిన ప్రతినిధులు క్షేత్రస్థాయిలో నమూనాలు సేకరించారు. ఎన్సీడీసీ బృందం స్థానికంగా ఉన్న పశువుల్లోనూ సీసం ఆనవాళ్లు ఉండే అవకాశాలపై దృష్టి సారించింది. అస్వస్థతకు గురైన వారి రక్తంలో సీసం, నికెల్ లాంటి భార లోహాలు అధిక స్థాయిలో ఉన్నట్టుగా ఎయిమ్స్ రెండో సారి విడుదల చేసిన నివేదికలోనూ వెల్లడైంది. పూర్తి స్థాయి నివేదికకు మరో రెండ్రోజుల సమయం పట్టే అవకాశముందని తెలుస్తోంది.
పండ్లు, కూరగాయలపై పిచికారీ చేసిన పురుగుమందుల కారణంగా అర్గానిక్ క్లోరైడ్ కలుషితమై ప్రజలు అస్వస్థత బారిన పడి ఉండవచ్చని జాతీయ పరిశోధనా సంస్థ నిపుణులు అనుమానిస్తున్నారు. సీసం, నికెల్ లాంటి భార లోహాలు రక్తంలో మిళితమై.. ఈ తరహా అస్వస్థత కలిగేందుకు నెలల సమయం పడుతుందని అభిప్రాయపడుతున్నారు. ఆర్గానో క్లోరిన్ శరీరంలోకి వెళ్తే మూర్ఛ, తలనొప్పి, తల తిరగడం, వాంతులు, వికారం, అవయవాలు కొట్టుకోవడం, వణకడం తికమకగా వ్యవహరించడం చెమటలు పట్టడం వంటి లక్షణాలు బయటపడతాయని చెబుతున్నారు. కొవిడ్ నివారణా చర్యల్లో భాగంగా చల్లిన క్లోరిన్, బ్లీచింగ్‌లు కూడా ఈ తరహా వింత మూర్చ వ్యాధికి కారణమై ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు అనుమానిస్తున్నారు.