Key Changes in Telangana BJP :ఎన్నికల ముంగిట పార్టీలో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చడమే లక్ష్యంగా సంస్థాగతంగా మార్పులు చేసిన బీజేపీ.. మరిన్ని చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. అందరికి సముచిత ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో భాగంగా రాష్ట్ర బీజేపీ నేతలకు మరికొన్ని కీలక పదవులు దక్కుతాయని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించిన నేపథ్యంలో రాష్ట్రం నుంచి మరొకరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, సోయం బాపురావు, ధర్మపురి అర్వింద్‌లు లోక్‌సభ సభ్యులుగా కొనసాగుతుండగా.. సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్‌లు ఉన్నారు. వీరిలో కేంద్రమంత్రి పదవి ఎవరిని వరిస్తుందోనన్న ఆసక్తి మొదలైంది.
Organizational Changes in Telangana BJP : బీజేపీ శాసనసభాపక్ష నేతతో పాటు.. జీహెచ్ఎంసీ, కరీంనగర్ కార్పొరేషన్‌లో ఫ్లోర్ లీడర్ వంటి పదవులను భర్తీ చేస్తారని సమాచారం. పదవుల అంశంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఇటీవల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలాంటి అసంతృప్తులు, అలకలకు ముగింపు పలకడంతో పాటు.. పార్టీ శ్రేణుల్ని పూర్తిగా ఎన్నికల కార్యక్రమాల్లో నిమగ్నం చేసేలా అధిష్ఠానం కార్యాచరణను అమలు చేయనుందని తెలిసింది.
ఇందులో భాగంగానే పార్టీ ఇన్‌ఛార్జులు తరుణ్‌ఛుగ్, సునీల్ బన్సల్ పూర్తిస్థాయిలో.. రాష్ట్ర పార్టీ నేతలకు అందుబాటులో ఉంటూ ఎన్నికల కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని తెలిసింది. కిషన్‌రెడ్డికి క్షేత్రస్థాయి పార్టీ వ్యవహారాలు, నాయకుల గురించి అవగాహన ఉండటంతో అసంతృప్తులను చక్కదిద్దడం పెద్ద సమస్య కాబోదని తెలంగాణ ముఖ్య నాయకులు అంచనా వేస్తున్నారు.