లాక్‌డౌన్ వల్ల నిత్యావసరాల కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే... భాగ్యనగర శివారు ఓఆర్‌ఆర్‌కు సమీపంలోని అజీజ్‌నగర్‌లో ఉన్న నాంది అసోసియేషన్ ఆఫ్ రూర్బన్ ఫార్మర్స్ సొసైటీ సభ్యులు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటున్నారు. మరో రెండు వారాలు లాక్‌డౌన్ కొనసాగినా బయటకు రావాల్సిన అవసరమే తమకు లేదంటున్నారు ఇక్కడి నివాసితులు.
ఉన్నత విద్యావంతులైన వీరు వేర్వేరు వృత్తుల్లో కొనసాగుతున్నా వ్యవసాయంపై ఆసక్తితో సొసైటీగా ఏర్పడి ఇక్కడ ఉంటున్నారు. వారికి కావాల్సిన కరెంట్‌ను సౌర పలకలతో ఉత్పత్తి చేసుకుంటున్నారు. పశువుల పేడతో ఉత్పత్తయ్యే బయో గ్యాస్‌తో వంటింటి అవసరాలు తీర్చుకుంటున్నారు. గేదెలను పెంచుతూ పాలు, పెరుగును తయారుచేసుకుంటున్నారు. ఇక్కడే సేంద్రియంగా సాగుచేసిన కూరగాయలను వాడుకుంటున్నారు.
పట్నం... పల్లె కలిస్తే రూర్బన్...
పాత రోజుల్లో ప్రతి గ్రామం ఆహార పదార్థాల వరకు స్వయం సమృద్ధితో నెట్ జీరోగా ఉండేవి. వారికి కావాల్సిన కూరగాయలు, ధాన్యాలను గ్రామంలోనే పండించుకునేవారు. ప్రస్తుతం నగరాల్లో ఈ ట్రెండ్ పెరుగుతోంది. ఇలాగే అజీజ్‌నగర్‌లో నార్ఫ్ సొసైటీ రూర్బన్(నార్ఫ్) పేరుతో దీనికి బీజం వేసింది. పట్నంలో మాదిరి అవసరాలు తీరుస్తూ.. పల్లెల్లో మాదిరి ఆహ్లాదకర వాతావరణం ఉండేలా రెండు కలగలిపి ఉండేలా తీర్చిదిద్దిన విధానమే రూర్బన్. సంవత్సరంలో 365 రోజులు ఇక్కడ నివసించేవారు బయటి ఉత్పత్తులపై ఆధారపడకుండా వాళ్లకు కావాల్సినవి వాళ్లే పండించుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
కమ్యూనిటీ వ్యవసాయం...
36.5 ఎకరాల్లో విస్తరించిన ఈ కమ్యూనిటీలో కొంతమంది ఇక్కడే నివాసముంటూ నగరానికి రాకపోకలు సాగిస్తుంటారు. మరికొందరు వారాంతంలో ఇక్కడ ఉండేందుకు వస్తుంటారు. ప్రస్తుతం లాక్‌డౌన్ కావడం వల్ల ఎక్కువ మంది ఇక్కడే కుటుంబాలతో ఉంటున్నారు. ఇక్కడ ఇల్లుతో పాటూ ప్రతి ఒక్కరికి అర ఎకరం మొదలు పొలం కూడా ఉంది. మూడింట రెండొంతుల పొలంలో కమ్యూనిటీ వ్యవసాయం చేస్తున్నారు. ఆసక్తి ఉన్నవాళ్లు సొంతంగానూ సాగులో పాలుపంచుకోవచ్చు.