MLC Narsireddy On old pension scheme : కొత్త పింఛన్ విధానం రద్దు చేసి పాత పింఛన్ విధానం అమలు కావడానికి ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక అత్యవసరమని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. నూతన పింఛన్ విధానం ప్రపంచ బ్యాంక్, ప్రపంచ ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ నుంచి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విధానంతో ఉద్యోగులు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. తమ పోరాటంలో తెలంగాణకు చెందిన ఉద్యోగులు చేరాలని కోరారు.
కొత్త పింఛన్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధిరించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సుమారు 17 సంఘాల సయుక్త సమావేశం హైదరాబాద్లోని బాగ్ లింగంపల్లిలో సుందరయ్య కళా నిలయంలో రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న నర్సిరెడ్డి.. అనంతరం ప్రసంగించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం పాత పింఛన్ విధానం రద్దు చేస్తుందా..! లేదా గద్దె దిగుతుందా..! అనే నినాదంతో ఐక్యవేదిక ముందుకు సాగాలని ఆయన సూచించారు.
"కొత్త పింఛన్ విధానం రద్దు చేసి పాత పింఛన్ విధానం అమలు కావడానికి ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక అవసరం. నూతన పింఛన్ విధానం ప్రపంచ బ్యాంక్, ప్రపంచ ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ నుంచి వచ్చింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం పాత పింఛన్ విధానం రద్దు చేస్తుందా..! లేదా గద్దె దిగుతుందా..! అనేది మన నినాదం కావాలి."-అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎమ్మెల్సీ