Oppositions on GO 317: తెలంగాణలో కొత్త జోనల్ విధానం ప్రకారం పోస్టుల విభజన కొందరికీ వరంగా, మరికొందరికి శాపంగా మారింది. ఉద్యోగుల విభజన, బదిలీల్లో కొత్తజిల్లాల వారీగా స్థానికతను పరిగణనలోకి తీసుకోకుండా ఉమ్మడి జిల్లా యూనిట్‌గా సీనియార్టీనే ప్రతిపాదికగా తీసుకోవటం పట్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి... జీవో నెంబర్ 317ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగుల విభజన, బదిలీల్లో స్థానికతను పరిగణించాలని సూచించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించాలని పేర్కొన్నారు. చర్చల తర్వాత మార్గదర్శకాల మేరకు బదిలీలు చేపట్టాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటి వరకు జరిగిన జీవో నెంబర్ 3 ప్రకారమే ఉద్యోగుల కేటాయింపు, బదిలీలు చేపట్టాలని ప్రస్తావించారు.
మేం ఉద్యమిస్తాం...
ఉద్యోగుల కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్... వ్యవహరిస్తున్న తీరుపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు అల్లాడిపోతుంటే... ఉద్యోగ సంఘాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. తక్షణమే 317 జీవోపై పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన... భాజపా ఉద్యమిస్తుందని ప్రకటించారు. త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.