కేంద్రం తెచ్చిన సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి పిలుపు మేరకు భారత్ బంద్‌కు కర్షక సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. కాంగ్రెస్, తెలుగుదేశం, సీసీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ వంటి పార్టీలన్నీ సంఘీభావం ప్రకటించాయి. వ్యవసాయ చట్టాల రద్దు, విద్యుత్ బిల్లులు వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ కేంద్రానికి వినిపించనున్నారు.
అంతా భాగస్వాములు కావాలి..
భారత్ బంద్‌ను విజయవంతం చేయాలంటూ కర్షక, కార్మిక, వృత్తిదారుల సంఘాలు హైదరాబాద్‌లో భారీ ప్రదర్శన నిర్వహించాయి. ప్రజలంతా స్వచ్ఛందంగా సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని కోరాయి. భారత్ బంద్ విజయవంతం చేయాలని కోరుతూ అఖిలపక్ష రైతు సంఘాలు, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్ లింగంపల్లి నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అన్నదాతలకు అండగా పోరాటంలో అంతా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
ఎలా మద్దతు తెలుపుతారు?
వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించే చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయలేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. బంద్‌కు తెరాస మద్దతివ్వడం రాజకీయ డ్రామాగా ఆయన అభివర్ణించారు. భారత్ బంద్‌కు కాంగ్రెస్ మద్దతిస్తోందని జాతీయ మహిళా కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. ప్రతీ కార్యకర్త బయటకు వచ్చి రైతులకు బాసటగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. సన్న వడ్లు కొనకుండా రైతులను తిప్పలు పెడుతున్న ముఖ్యమంత్రి.. ఆందోళనలకు ఎలా మద్దతు తెలుపుతారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. అన్నదాతలకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని కోమటిరెడ్డి ఆరోపించారు.
తక్షణమే రద్దు చేయాలి..
రైతుల నడ్డివిరిచే కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్రం తక్షణమే రద్దు చేయాలనీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. బంద్‌ను విజయవంతం చేయాలంటూ చేపట్టిన ద్విచక్రవాహన ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సాగు చట్టాల వల్ల రైతులకు తీరని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు భారత్ బంద్‌కు సిక్కు సంఘాలు సైతం సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.