Opposition parties Telangana Election Campaign 2023 : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. రాజకీయ పార్టీలు ప్రచారంలో జోరు (Telangana Election Campaign 2023) పెంచాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకులు జెట్టి కుసుమకుమార్.. నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఉమ్మడి నిజామాబాద్‌లో 9 స్థానాలను హస్తం పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో పార్టీ నియోజకవర్గ అభ్యర్థి అనిరుధ్‌రెడ్డితో కలిసి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పర్యటించారు.
ఎన్నికల ప్రచారం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంపై నేతలకు దిశానిర్దేశం చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి... కేసీఆర్ ఎన్ని కుతంత్రాలు పన్నినా కాంగ్రెస్ విజయాన్ని ఆపలేరన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తిదాడి కపటనాటకంగా పేర్కొన్నారు. సానుభూతి కోసం బీఆర్ఎస్ ఇలాంటి ఎత్తులు వేస్తోందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (KomatiReddy Venkat Reddy ON BRS) వ్యాఖ్యానించారు.
"తెలంగాణకోసం 1160 మంది బలిదానాలు చేశారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం లోటు బడ్జెట్‌గా మార్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పదవి పోతుందన్న భయంతో రోజుకు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు." - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ
Telangana Congress Election Campaign 2023 :సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆడం సంతోశ్‌కుమార్.. ప్రచారం వేగవంతం చేశారు. నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్తూ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను వివరిస్తూ.. తమకు ఓటేయాలని కోరుతున్నారు. వికారాబాద్ హస్తం పార్టీ అభ్యర్థి గడ్డం ప్రసాద్‌కుమార్.. మర్పల్లి మండలం తిమ్మాపూర్, రావులపల్లి, పెద్దాపూర్, కాల్కూడా, రామస్తాపూర్, భూచన్‌పల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య.. నియోజకవర్గంలోని మంతపురి, శర్బనాపురం, గొలనుకొండ, తూర్పుగూడెం, కొల్లూరు, మందనపల్లి, టంగుటూరు, శారాజిపేట గ్రామాల్లో ప్రచారం చేశారు.
కోరుట్ల కాంగ్రెస్ అభ్యర్థి జువారి నర్సింగరావు మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, కోరుట్ల మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుంచి.. హస్తం పార్టీలోకి చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నిర్మల్ జిల్లా భైంసాలో సమావేశం నిర్వహించిన బీజేపీ నేత రాజేశ్‌బాబు.. బీఆర్ఎస్ సర్కార్, స్థానిక ఎమ్మెల్యే తీరుపై విమర్శలు గుప్పించారు. ఆర్మూర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నియోజకవర్గంలోని తల్వెద, లక్కంపల్లి, చిమ్రాజ్‌పల్లి, మల్లారం గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా లాక్కంపల్లి, మల్లారం, చిమ్రాజ్‌పల్లి గ్రామాలకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు కమలం పార్టీలో చేరారు.