Opposition on Medigadda Project Issue : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజిపై రాకపోకలు సాగించే వంతెన కుంగిపోవడంపై కాంగ్రెస్ మండిపడింది. బ్యారేజీ సందర్శనకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అక్కడే బైఠాయించిన శ్రీధర్‌బాబు.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం శ్రీధర్‌బాబును ప్రాజెక్టు సందర్శనకు అనుమతి ఇచ్చారు.
Congress Leaders Fire on Medigadda Project : మేడిగడ్డ బ్యారేజీ ప్రమాదానికి కేసీఆర్ కుటుంబమే కారణమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాంచినప్పుడు డబ్బులు వృధాగా పోతాయని అప్పుడే చెప్పామని.. ప్రస్తుతం నిజం అవుతుందని విమర్శించారు. కేంద్ర హోంమంత్రి, గవర్నర్.. మేడిగడ్డపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతపై క్షేత్రస్థాయి సందర్శనకు రావాలని మంత్రులు, హరీశ్‌రావు, కేటీఆర్‌కు సవాల్ విసిరారు.
"ఈ ప్రాజెక్ట్ కుంగిపోవడం మానవతప్పిదంగా నిరుపితమైంది. కేసీఆర్, హరీశ్‌రావు గొప్పగా చెప్పుకునే ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం పెను ప్రమాదంలో పడింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?. లక్ష కోట్లు సీఎం కేసీఆర్, కొంత మంది కాంట్రాక్టర్లు కలిసి పంచుకున్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్‌తో పాటు వర్షాలు వచ్చి గతంలో కొట్టుకుపోయాయో.. వీటి అన్నింటి మీద కేంద్ర కమిటీ వచ్చి విచారణ జరపాలి. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా.. తక్షణమే సిట్టింగ్ జడ్జ్‌ని పెట్టి ఈ ప్రాజెక్ట్‌లో జరిగిన అవినీతిని బయట పెట్టాలి. ఈ ప్రాజెక్ట్‌పై ఎందుకు విచారణకు ఆదేశించలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అడుగుతున్నాను."- రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
Kishan Reddy Reaction onMedigadda Project : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రారంభమైనప్పటీ నుంచి వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు భద్రతపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.