PEDDIREDDY RAMACHANDRA REDDY : ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో ఎవర్ని కదిపినా.. ఆయన సంబంధీకుల దారుణాలను కథలు కథలుగా చెబుతారు. కానీ వారెవ్వరూ బహిరంగంగా నోరు విప్పే సాహసం చేయరు. ప్రజల్ని ఇంతలా భయం గుప్పిట్లో పెట్టి ఏలుతున్నారు. తమ మాటే చట్టం.. తమకు నచ్చినదే రాజ్యాంగం.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ ఇంటిపై దాడి నేపథ్యంలో అరాచకాలు చర్చనీయాంశమయ్యాయి.
60మంది టీడీపీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు: ఏపీలోని పుంగనూరులో పెద్దిరెడ్డి సంబంధీకులు మూడున్నరేళ్లలో 300 మందికి పైగా టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టించారు. వారిలో 60 మందిపై హత్యాయత్నం, 40 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ అక్రమ కేసులేనని, తమ పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకే ఇలా ఇరికించారని పుంగనూరు తెలుగుదేశం నియోజకవర్గ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి ఆరోపించారు. పోలీసులూ వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని విమర్శించారు.
ప్రశ్నిస్తే ప్రైవేటు సైన్యం దాడి:పెద్దిరెడ్డి సంబంధీకుల అరాచకాలను ప్రశ్నిస్తే.. వారిపై ప్రైవేటు సైన్యం దాడులకు తెగబడుతోంది. సదుం మండలం బూరగమంద పంచాయతీ పచ్చార్లమాకులపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు రాజారెడ్డిని ఏప్రిల్‌లో కిడ్నాప్ చేశారు. ఓ తోటలో బంధించి రెండు కాళ్లు విరిచేశారు. వేలూరు ఆసుపత్రిలో ఆరు నెలలపాటు చికిత్స తీసుకున్న ఆయన ఇప్పటికీ నడవలేకపోతున్నారు. ఈ ఘటనకు బాధ్యులుగా ఇద్దరు అనామకులను అరెస్టు చేశారు. పులిచెర్ల మండలం చల్లావారిపల్లెకు చెందిన టీడీపీ కార్యకర్త శివకుమార్‌పై జులైలో వైసీపీ నాయకులు దాడికి దిగారు. పెద్దిరెడ్డి కుటుంబీకులకు చెందిన శివశక్తి డెయిరీలోకి తీసుకెళ్లి మరీ ఆయన చేతులు విరగ్గొట్టారు.
టీడీపీ కార్యాలయానికి అద్దెకు ఇచ్చినందుకు కూల్చివేత నోటీసులు: తెలుగుదేశం నియోజకవర్గ కార్యాలయం కోసం ఇంటిని అద్దెకు ఇచ్చినందుకు దాని యజమానికి మున్సిపల్ అధికారులతో నోటీసులు ఇప్పించారు. ఆయన వెనక్కి తగ్గలేదు. కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ గ్రామ, బూత్ కమిటీల ఎంపిక సమావేశానికి టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావడంతో.. అప్పటికప్పుడు మరోసారి నోటీసులిచ్చి భవనాన్ని కూల్చేందుకు సిద్ధయ్యారు. యంత్రాలను రప్పించి, పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. భవన యజమానికి బైపాస్ రోడ్డులో ఉన్న ఒక స్థలం విషయమై బెదిరింపులకు తెగబడ్డారు. భయపడిన బాధితుడు టీడీపీ కార్యాలయంలోని సామగ్రిని బయట పడేశారు. తర్వాత మున్సిపల్ అధికారులు ఆ భవనం జోలికే వెళ్లలేదు.
నామినేషన్లు వేసేవారిని భయభ్రాంతులకు గురి: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల తరఫున నామినేషన్లు వేయడానికి వచ్చిన వారిని భయభ్రాంతులకు గురిచేశారు. నామినేషన్ పత్రాలను లాక్కున్నారు. పోటీదారులకు అవసరమైన ధ్రువపత్రాలను జారీ చేయకుండా ఆటంకాలు సృష్టించారు. నియోజకవర్గం మొత్తంలో ఒకట్రెండు స్థానాలు మినహా అన్నింటినీ బలవంతంగా, భయపెట్టి మరీ ఏకగ్రీవం చేయించుకున్నారు. పుంగనూరు 16వ వార్డులో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ముందుకొచ్చిన శ్రీకాంత్‌ను ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి దౌర్జన్యంగా బయటకు తీసుకొచ్చి, పోలీసుల సమక్షంలోనే నామినేషన్ పత్రాలను లాగేశారు. సదుం ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ వేయటానికి వచ్చిన బీజేపీ నాయకులను రాళ్లతో కొట్టి తరిమేశారు. పుంగనూరు మండలం మార్లపల్లెకు చెందిన 80 ఏళ్ల వృద్ధుడు అంజిరెడ్డి టీడీపీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వెళ్లగా దాడికి ప్రయత్నించారు.