ప్రభుత్వ ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు ఇవాళ తెరపడే అవకాశం కనిపిస్తోంది. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ, పదవీ విరమణ వయస్సు పెంపు వంటి అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ శాసనసభలో ప్రకటన చేసే అవకాశం ఉంది. ఉద్యోగుల వేతన సవరణ కోసం ఏర్పాటు చేసిన సీఆర్ బిస్వాల్ కమిటీ... 2020 డిసెంబర్ 31న నివేదిక ఇచ్చింది. 7.5 శాతం ఫిట్‌మెంట్‌ను కమిషన్ సిఫారసు చేసింది.
ఉద్యోగ సంఘాలతో చర్చలు...
కమిషన్ సిఫారసులపై సీఎస్ సోమేశ్ కుమార్ నేతృత్వంలోని అధికారుల కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది. 7.5 శాతం ఫిట్మెంట్ ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదన్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కనీసం 40 శాతం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. అనంతరం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాగా... ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొద్ది రోజుల క్రితం సీఎంను కలిసిన ఉద్యోగసంఘాల నేతలు... ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చిన మధ్యంతర భృతి కంటే ఎక్కువ పీఆర్సీ ఇచ్చేందుకు కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.
రూ. 8వేల కోట్లు...
ఉద్యోగులకు మంచి వేతనసవరణ ఇస్తామని, ఇందుకు సంబంధించి త్వరలోనే ప్రకటన చేస్తానని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తెలిపారు. బడ్జెట్‌లో వేతనసవరణ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించని ప్రభుత్వం... ఆర్థికశాఖ పద్దులో నిర్వహణా వ్యయం కింద రూ. 8,000 కోట్లు అదనంగా కేటాయించారు. పీఆర్సీ ప్రకటనకు కేంద్ర ఎన్నికల సంఘం... రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిచ్చింది.