operation rope in Hyderabad : జంటనగరాల్లో ఆపరేషన్ రోప్ విధానం అమలు వలన క్రమంగా మార్పులు వస్తున్నాయి. ఇప్పటికే ఈ విధానం అమల్లోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తోంది. గడిచిన ఎనిమిది నెలల కాలంగా రోప్‌ను పకడ్భందీగా అమలు చేస్తున్నట్టు ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రారంభించిన కొత్తలో హైదరాబాద్ కమిషనరేట్‌లోని ట్రాఫిక్ పోలీసు అధికారులు వ్యక్తిగతంగా... వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రయాణికులకు అవగాహన కల్పించారు. తరువాత అధికారులు స్టాప్ లైన్ రూల్, ఫ్రీ లెఫ్ట్ వంటి ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారులపై చర్యలకు ఉపక్రమించారు. తద్వారా రోప్‌ను కఠినంగా అమలు చేయడం ప్రారంభించారు.
రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు: ప్రధాన మార్గాలు, ఫుట్‌పాత్‌లపై కాలినడకకు వీలు లేకుండా ఆక్రమణలు చేస్తే చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు. దీని వలన ఆపరేషన్ రోప్ పౌరుల వ్యక్తిగత ప్రయాణ ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చినట్టు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. దాదాపు కమిషనరేట్‌లోని అన్ని ప్రధాన కూడళ్లలో మార్పు వచ్చినట్టు చెబుతున్నారు. రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు ట్రాఫిక్ పోలీసులు... వాహనదారుల వ్యక్తిగత భద్రతపై దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి రాంగ్‌సైడ్ డ్రైవ్, ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్‌కు వ్యతిరేకంగా ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించారు. ప్రయాణికులు, పాదచారుల భద్రత కోసం ఆర్టీసీ బస్సులతో పాటు భారీ వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలపై ప్రత్యేక డ్రైవ్‌ను కూడా ప్రారంభించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కొరఢా ఝుళిపిస్తున్నారు.
అనవసరమైన సైరన్‌లు మోగించినా చర్యలు తప్పవు:అనవసరంగా ఎవరైనా వాహనాలకు సైరన్‌లు వినియోగించినా చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేక డ్రవ్‌లు నిర్వహించి అనుమతులు లేని వాహనాలకు బిగించిన సైరన్‌లు పోలీసులు తొలగిస్తున్నారు. అంబులెన్స్‌లు, అగ్నిమాపక శకటాలు, అత్యవసర సహాయ చర్యలు చేపట్టే బృందాలు, పోలీసు, మోటారు వాహనాల విభాగం వారు మాత్రమే సైరన్‌లు వినియోగించడానికి అనుమతి ఉన్నట్టు ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు. వాహనదారుల నిబంధనల ఉల్లంఘనలపై 9010203626 నెంబరుకు సమాచారం అందించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెబుతున్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిపై కూడా కేసులు నమోదు చేసి చార్జ్‌షీట్‌లు కోర్టులో దాఖలు చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైతే చర్యలు తప్పవని దీని వలన ఉద్యోగులు, విద్యాదర్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటారని... మద్యం సేవించి వాహనాలు నడపవద్దని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 2687 మంది మద్యం సేవించి వాహనాలు నడుపతూ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడగా... వారి పై పోలీసులు 1717 చార్జ్‌షీట్‌లు కోర్టులో దాఖలు చేశారు.
జరిమానాలు:మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి 35,90,500 రూపాయల జరిమానా విధించారు. గత నెల 45,710 మంది వాహనదారులు స్టాప్ లైన్ దాటి నిబంధనలు ఉల్లంఘించారు. ఫ్రీలెఫ్ట్‌కు 9337 మంది వాహనదారులు ఆటంకం కల్పించారు. 41 మంది ఫుట్‌పాత్‌లు ఆక్రమించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. గత నెల 63,508 మంది వాహనదారులు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసినట్టు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. 13431 మంది ట్రిపుల్ రైడింగ్ చేస్తూ పట్టుబడ్డారు. 864 ఆర్టీసీ బస్సులు, 1908 భారీ వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు చేపట్టారు. వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న 12,125 మంది వాహనదారులపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.