పరీక్ష అంటే చాలా ప్రిపేర్ కావాలి. ప్రశ్నలకు సమాధానాలు అర్థం చేసుకొని గుర్తు పెట్టుకోవాలి. లేదంటే కనీసం బట్టీ పట్టితే కానీ పరీక్ష పాస్ కాలేము. అయితే ఈ విధానంలో కీలక మార్పులకు కసరత్తు జరుగుతోంది. ముఖ్యంగా ఇంజినీరింగ్, ఇతర సాంకేతిక విద్య కోర్సుల్లో విషయాన్ని గుర్తుంచుకోవడం కన్నా... ఆ విషయాన్ని ప్రాక్టికల్‌గా అమలు చేయడమే అవసరమని విద్యా శాఖ భావిస్తోంది. అందులో భాగంగా పుస్తకాలను చూసి పరీక్ష రాసేలా.. ఓపెన్ బుక్ ఎగ్జామ్ విధానం అమలు చేసేందుకు సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. లా పూర్తి చేసిన తర్వాత న్యాయవాది వృత్తి ప్రాక్టీసు చేసేందుకు అవసరమైన ఆలిండియా బార్ ఎగ్జామ్ ప్రస్తుతం ఈ విధానంలోనే జరుగుతోంది. ఇలాంటి పద్ధతిని ఇంజినీరింగ్‌తో పాటు డిగ్రీలోనూ కొన్ని సబ్జెక్టుల్లో ఓపెన్ బుక్ విధానం అమలు చేసేందుకు కొంతకాలంగా అధ్యయనం జరుగుతోంది. ఈ విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్ కోర్సుల్లో కొన్ని సబ్జెక్టుల్లో ఓపెన్ బుక్ ఎగ్జామ్ విధానం ప్రవేశపెట్టనున్నట్లు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఈటీవీ భారత్‌కు వెల్లడించారు.
ఆన్ లైన్ పరీక్షలతో కొన్ని సమస్యలు
ఆన్ లైన్లో పరీక్షలు నిర్వహించేందుకు కొంత ప్రయత్నం జరుగుతున్నప్పటికీ... సాంకేతిక పరిజ్ఞానం పూర్తిస్థాయి పరిణితిలో లేనందున కొంత ఆలోచించాల్సి వస్తోందన్నారు. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా ఉండటం లేదన్నారు. ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా కెమెరా ఆఫ్ అయిపోయినప్పుడు.. విద్యార్థులు కాపీయింగ్ చేసే అవకాశం ఉందని తెలిపారు. అలాంటి విద్యార్థులపై చర్య తీసుకుంటే ఓ సమస్య.. తీసుకోకపోతే మరో సమస్య వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాబట్టి పలు అంశాలపై అధ్యయనం జరగాల్సి ఉందని తెలిపారు. ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ, కొన్ని అటానమస్ కళాశాలల్లో ఆన్ లైన్ పరీక్షలు జరుగుతున్నాయని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ వెల్లడించారు.
ప్రత్యక్ష తరగతులకు తొందరలేదు
ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీలు, ఇతర విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభించే తొందర లేదని నవీన్ మిత్తల్ స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రమూ ఇప్పట్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభించే ఆలోచన లేదన్నారు.