ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం పొందేందుకు రోగులు గంటలు, ఒకోసారి రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. అప్పటికే నీరసంగా ఉండడం ఓపీల వద్ద చాంతాడంత క్యూలను చూసి కొందరు డీలా పడిపోతున్నారు. జిల్లాల నుంచి వచ్చే రోగుల ఇబ్బందులు వర్ణనాతీతం. ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టిసారించాలని కోరుతున్నారు.
● ఆసుపత్రి: గాంధీ ● ఓపీ చీటీ ఇచ్చే సమయం: ఉ.8.30 నుంచి మధ్యాహ్నం 11 వరకు ● సరాసరిన రోజుకు వచ్చే రోగులు: 1600
● ఆసుపత్రి: ఇ.ఎన్.టీ, కోఠి ● ఓపీ చీటీ ఇచ్చే సమయం: ఉ.8.30 నుంచి మ.11 వరకు ● సరాసరిన రోజుకు వచ్చే రోగులు: 1200
నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన 51 ఏళ్ల వ్యక్తి నిమ్స్ ఆర్థోపెడిక్ విభాగంలో వైద్యం కోసం ఉదయం 9 గంటలకే ఆసుపత్రికి వచ్చారు. ఓపీ చీటీ తీసుకొని వైద్యుణ్ని కలిశారు. ఆయన సూచనతో పరీక్షల అనంతరం రుసుము చెల్లించేందుకు వరసలో నిల్చుంటే మధ్యాహ్నం ఒంటి గంటకు తనవంతు వచ్చింది. పరీక్ష ఫలితం కోసం వెళ్తే కౌంటర్ మూసేశారు. ఇంటికెళ్లలేక రాత్రికి తెలిసిన వాళ్లింట్లో తలదాచుకున్న ఆయన మరుసటిరోజు రిపోర్టుతో వైద్యుణ్ని కలిసేందుకు వెళ్తే మళ్లీ ఓపీ తీసుకోవాలన్నారు. తీరా ఓపీ రాయించుకుని వెళ్తే ఆ వైద్యుడు అందుబాటులో లేరు. ఆయన ఉన్నరోజే రావాలని వెనక్కి పంపారు.