ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలం హులికల్లు గ్రామ పంచాయతీ పరిధిలోని కల్యంకు గ్రామంలో.. నాలుగు దశాబ్దాలుగా పంచాయతీ ఎన్నికల ఊసేలేదు. స్థానికులు ఎన్నడూ ఓటేసి ఎరుగరు. అలాగని ఫ్యాక్షన్ గ్రామం కాదు.. ఎన్నికలను బహిష్కరించనూ లేదు.. ఆ ఊరికి చెందిన మురికాలయ్య అంటే ప్రేమతో కూడిన అభిమానం. ఆయనను ఏకగ్రీవంగా సర్పంచిగా ఎన్నుకుంటూ వచ్చారు. చుట్టు పక్కల గ్రామాల్లోనూ ఆయన ఆదరణ పొందారు. ఎలాంటి సమస్య ఎదురైనా పరిష్కారానికి నాయకులు ఆశ్రయించేవారు. ఆయన సర్పంచిగా ఉన్నన్ని రోజులు ఆ గ్రామ ప్రజలు పోలీసుస్టేషన్ ఎరుగరంటే అతిశయోక్తి కాదు. ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా ప్రజలందరూ కలిసి నిర్ణయాలు తీసుకునేవారు. ఆయన నిస్వార్థంగా పనిచేసి 16 ఎకరాల పొలాన్ని పోగొట్టుకున్నారు. ఆరుగురు కుమారులున్నా పక్కా గృహాలు కూడా వారు నోచుకోలేదు.
ప్రగతి పథం..
గ్రామంలో ఫ్రాథమికోన్నత పాఠశాల, పంచాయతీ కార్యాలయం, ఆలయాల నిర్మాణానికి మురికాలయ్య కృషి చేశారు. పేదలకు పక్కా గృహాల మంజూరుకు చర్యలు తీసుకున్నారు. ఆయన తర్వాత తెదేపా మద్దతుదారు పరమేశ్వరప్పను ఏకగ్రీవంగా గ్రామస్థులు ఎన్నుకున్నారు.