లాక్డౌన్ వల్ల భక్తులకు ఆలయాల్లోకి అనుమతి లేనందున రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ఆన్లైన్ ద్వారా పూజలు చేసుకునే అవకాశాన్ని దేవాదాయ శాఖ కల్పించింది. యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ, బాసర, సికింద్రాబాద్ గణేశ్ ఆలయం సహా రాష్ట్రంలోని 12 దేవాలయాల్లో ఇప్పటికే ఆన్లైన్ ద్వారా పూజల సదుపాయం కొనసాగుతోంది.
మరో 7 ఆలయాల్లో ఆన్లైన్ పూజలు - తెలంగాణ ఆలయాల్లో ఆన్లైన్ పూజలు
లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలోని మరో ఏడు దేవాలయాల్లోనూ ఆన్లైన్ పూజల సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మీ సేవ పోర్టల్లో భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్ ద్వారా చేయాల్సిన పూజలను ఎంచుకోవచ్చని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ చెప్పారు.
మరో 7 ఆలయాల్లో ఆన్లైన్ పూజలు
తాజాగా మరో ఏడు ఆలయాల్లోనూ ఈ సౌకర్యాన్ని దేవాదాయ శాఖ కల్పించింది. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం, తాడ్బండ్ ఆంజయనేయ స్వామి ఆలయం, ఆలంపూర్ జోగులాంబ ఆలయం, కీసర రామలింగేశ్వరస్వామి ఆలయం, శ్రీనగర్ కాలనీ వేంకటేశ్వరస్వామి ఆలయం, చెరువుగట్టు రామలింగేశ్వరస్వామి ఆలయం, జమాలపురం వేంకటేశ్వరస్వామి ఆలయంలోనూ ఆన్లైన్ సేవలు పొందవచ్చని తెలిపింది. భక్తుల పేరిట పూజలు చేసి వారి చరవాణికి సందేశం అందిస్తామని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ చెప్పారు.