ఒకవైపు రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరిన దాదాపు లక్ష మంది విద్యార్థులు టీవీ పాఠాలు ఎప్పుడు మొదలవుతాయా అని చూస్తున్నారు. ప్రవేశాలు ఇంకా జరుగుతున్నందున అవి పూర్తయిన తర్వాత మొదలవుతాయని అధ్యాపకులూ భావిస్తూ వచ్చారు. మరో వైపు ఇంటర్ విద్యాశాఖ మాత్రం చడీచప్పుడు లేకుండా సోమవారం మధ్యాహ్నం నుంచి దూరదర్శన్ ద్వారా ఆన్‌లైన్ పాఠాలు ప్రారంభమయ్యాయని ప్రకటించింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పాఠాలను ప్రసారం చేస్తున్నారు. ఈ మేరకు ఈనెల 16 నుంచి 31వ తేదీ వరకు కాలపట్టికను వెల్లడించారు.
కనీసం ఒకటి రెండు రోజుల ముందయినా ఆన్‌లైన్ పాఠాల ప్రారంభ తేదీని చెప్పకపోవడంపై అధ్యాపకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందుగా చెప్పకపోవడంతో విద్యార్థులు మొదటి రోజు పాఠాలను వినలేకపోయారు. చూస్తే చూశారు... లేకుంటే లేదన్న భావన అధికారుల్లో ఉన్నట్లు దీన్ని బట్టి అర్థమవుతోందని కొందరు అధ్యాపకులు వ్యాఖ్యానించారు.