రాజధానిని మరింత సురక్షితంగా మార్చేందుకు పోలీసులకు పౌరులు సహకారం అందించొచ్చు. డయల్ 100 ద్వారా ప్రమాద సమాచారాలను అందిస్తున్నా.. ఆన్‌లైన్ మ్యాపింగ్ ద్వారా సురక్షితం కాని ప్రాంతాలను వివరించేందుకు అవకాశాలున్నాయి. విదేశాలో నేరనియంత్రణకు అక్కడి పోలీస్ యంత్రాంగం ప్రజల భాగస్వామ్యం కోరుతోంది. చిన్నారులు.. మహిళలు... యువతుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వారికి ఇబ్బందులు కలిగించే ప్రాంతాల వివరాలను తెలపాలంటూ విజ్ఞప్తులు చేస్తోంది. మనం కూడా మహిళా భద్రతకు ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న యాప్‌లు.. సామాజిక మాధ్యమాల్లో వివరాలను చెబితే స్పందించి కార్యచరణ రూపొందించనున్నారు. దేశంలో స్త్రీ వ్యతిరేక హింస క్రమంగా తగ్గుతున్న నగరాల జాబితాలో హైదరాబాద్ ఇప్పటికే ఉన్నందున ప్రజలు మరింత సమాచారాన్ని అందిస్తే ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు.
ఆన్‌లైన్ మ్యాపింగ్ అంటే...
ఆన్‌లైన్ మ్యాపింగ్ అంటే ఫలానా ప్రాంతంలో రాత్రుళ్లు మహిళలు, యువతులు వారి గమ్యస్థానాలు చేరుకునేందుకు సరైన రవాణా సౌకర్యాలు లేవని ప్రజలు భావిస్తే ఆ ప్రాంతం వివరాలు మ్యాప్‌లో నమోదు చేసి పోలీసులకు పంపాలి. పోలీసులు స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించి, రక్షణ చర్యలు చేపడతారు.
- అనూహ్య ఘటనలు కనిపించగానే ఆ ప్రాంతం వివరాలను మ్యాప్‌లో నమోదు చేయడం ద్వారా పోలీసులకు వేగంగా సమాచారం అందుతుంది. పోలీసుల కంటే వేగంగా అంబులెన్స్‌లు, అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకుంటాయి.
- నగరంలో వివిధ కారణాలతో రాత్రుళ్లు ప్రయాణాలు కొనసాగిస్తున్న మహిళలు, యువతులకు రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.