OnlineLoan App Fraud Gang Arrest In Hyderabad : ఈ మధ్యకాలంలో ఆన్లైన్ రుణ యాప్(Online Loan App)ల పేరుతో సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. తీసుకున్న అసలు.. వడ్డీ మొత్తం చెల్లించిన.. ఇంకా డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. వీరి బాధను భరించలేక కొందరు వారు చెప్పిన మొత్తాలను కడుతుంటే.. మరికొందరు పరువుపోయిందని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీరిపై సైబర్ పోలీసులు(Cyber Police) ఎంత నిఘా పెట్టినాసరే.. అసలు భయం లేకుండా వారిపని వారు కానిచ్చేస్తున్నారు. అయితే వీరి ఆగడాలకు చెక్ పెడుతూ.. పోలీసులు పూర్తిస్థాయిలో నిఘాను పెంచారు. దాని ఫలితమే ఇప్పుడు ఐదుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు అరెస్టు.. ఈవిషయంపై రాచకొండ సీపీ చౌహాన్ పూర్తి వివరాలు వెల్లడించారు.
Chinese Loan Apps Harassment: రుణ యాప్‌ల పేరుతో వేధింపులకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులు హర్యానాలోని గురుగ్రామ్ కేంద్రంగా యాప్ నిర్వహిస్తూ.. రుణాలు ఇస్తున్నారని సీపీ చౌహాన్ తెలిపారు. చైనాకు చెందిన జినా అనే మహిళ ద్వారానే లోన్‌యాప్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు వివరించారు. ఆమె గురుగ్రామ్‌కు చెందిన అషుతోశ్ మిశ్ర, లవమిత్ సైనీ, ప్రశాంత్ కుమార్ తన్వార్, ప్రిన్స్‌పాల్, వికాస్ శర్మలను సిబ్బందులుగా నియమించుకొని జినా హ్యాండీ లోన్ యాప్ ద్వారా తక్కువ మొత్తాలు అందిస్తోందన్నారు.
'మీ వాళ్లను రుణం చెల్లించమనండి.. లేదంటే మీ నగ్న చిత్రాలు వైరల్ చేస్తాం'
Loan App Fraud Case In Telangana : షేక్ అబ్దుల్ బారీ అనే వ్యక్తి ఈ రుణ యాప్ ద్వారా రూ.10,500 తీసుకున్నాడని చౌహాన్ తెలిపారు. ఈక్రమంలో అతని వాట్సప్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకునే సమయంలో మొబైల్ కాంటాక్టులు, గ్యాలరీలో ఉన్న ఫొటోలు.. నిర్వాహకులకు అందాయన్నారు. అంతే వాటి ద్వారా అతని ఫొటోలు మార్ఫింగ్ చేస్తామంటూ బెదిరించి.. అతని వద్ద నుంచి దాదాపు రూ.2,50,000 కొల్లగొట్టారని చెప్పారు. బాధితుడి ఫిర్యాదుతో రుణయాప్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్టు చేశామని వెల్లడించారు. వారి వద్ద నుంచి మూడు లాప్‌టాప్‌లు, ఆరు సెల్ఫోన్లు, 18 సిమ్ కార్డులు,12 డెబిట్ కార్డులు, రూ.1.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.