Online home services: నగర జీవనం అంటేనే ఉరుకుల పరుగుల జీవనం. ఉద్యోగం, ఉపాధి బాట పట్టేవాళ్లు ఎందరో చిన్నా, చితకా పనులు చేసుకునేందుకు సమయం వెచ్చించలేని పరిస్థితి. దీన్నే వ్యాపార మార్గంగా మలచుకుంటున్నాయి కొన్ని సంస్థలు. మీట నొక్కగానే మేమున్నామంటూ ఇంటికి వచ్చి కావాల్సిన పనులు చేస్తున్నాయి. దీంతో సెలవు రోజుల్లో కుటుంబంతో మాత్రమే గడిపేలా పలువురు ఇలాంటి యాప్ ఆధారిత సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ఉదయం పాలు వేసే దగ్గర నుంచి క్షవరం, లాండ్రీ, ఇల్లు శుభ్రం చేసుకోవడం, దుస్తులు కుట్టడం వంటి వాటికి ఇంటి ముంగిట వాలిపోతున్నారు.
వారే వచ్చి ఊడుస్తారు..
ఇంటిని శుభ్రం చేయడం ఇప్పుడు అత్యంత డిమాండ్ ఉన్న సేవల్లో ఒకటిగా మారింది. నగరంలో చాలా కాలం నుంచి ఈ సేవలను అనేక సంస్థలు అందిస్తున్నాయి. డీప్ క్లీనింగ్, కిచెన్ క్లీనింగ్‌ను ఎక్కువ మంది నగరవాసులు కోరుకుంటున్నారు. విదేశాల్లో ఉంటున్నవారు, కొవిడ్‌తో నగరం వదిలి సొంత ఊళ్లకు వెళ్లినవారు ఇళ్లను శుభ్రం చేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా మాదాపూర్, కొండాపూర్, ఖాజాగూడ, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, కోకాపేట, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో ఈ సేవలకు డిమాండ్ ఉంది. ఐటీ ఉద్యోగులు, ఆకాశహర్మ్యాల్లోని ఫ్లాట్లు, విల్లాల నుంచి ఎక్కువగా బుకింగ్ వస్తున్నాయని ఆయా సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.
ఇంటికొచ్చి కొలతలు తీసుకుంటారు..
పురుషులకు అవసరమైన సూట్‌లు, మహిళల, చిన్నారుల దుస్తులు, మగ్గం వర్క్‌తో పాటు ఇతర డిజైన్లను ప్రత్యేకంగా చేయించాలనుకునేవారు ఈ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుంటే సంస్థ ప్రతినిధి షెడ్యూల్ సమయంలో వచ్చి కొలతలు తీసుకుంటారు. అనంతరం డిజైనర్ వీడియో లేదా ఆడియోకాల్‌లో మాట్లాడి నచ్చిన విధంగా దుస్తులను కుట్టి డెలివరీ చేస్తారు. మార్పులు, చేర్పులు అవసరమైతే మరోసారి తీసుకెళ్లి రీడెలివరీ చేస్తారు. క్లౌడ్ టేలర్, టేలర్‌మోబ్, టేలర్‌జంక్షన్ తదితర సంస్థలు అందుబాటులో ఉన్నాయి. రూ.650 నుంచి మొదలుకొని లక్షలాది రూపాయల విలువైన దుస్తులకు ఆర్డర్లు ఇస్తున్నారు.