అంతర్జాలంలో బెట్టింగ్ నిర్వహిస్తూ వందల కోట్ల రూపాయలు హవాలా రూపంలో దేశం దాటిస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వాహకులు దిల్లీకే పరిమితం కాలేదని సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లోనూ డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసినట్టు విచారణ అధికారులకు ఆధారాలు లభించాయి. 20కి పైగా ఉన్న ఈ కంపెనీల్లో ప్రధాన డైరెక్టర్లుగా ఎక్కువ శాతం చైనీయులే ఉన్నారని... వాటికి అనుబంధంగా మరికొన్ని కంపెనీలున్నాయని గుర్తించారు. ఆయా కంపెనీల నుంచి కోట్ల రూపాయల విలువైన లావాదేవీలు జరిగినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు.
మూడు నెలల్లో... 100 కోట్లు
కాగితాలపై ప్రారంభించిన ఈ కంపెనీల చిరునామాలు ఒకేచోట ఉండటం వల్ల అనుమానం వచ్చి రికార్డులు పరిశీలించటంతో ఇవి బయటపడ్డాయి. ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఉన్న డోకీపీ, లింయున్ సంస్థలతో డొల్ల కంపెనీలకు సంబంధాలున్నాయి. యాహువో సహకారంతో 30 కంపెనీలను స్థాపించిన చైనీయులు హవాలా మార్గంలో మూడు నెలల్లో 100 కోట్లు తరలించినట్టు దర్యాప్తులో తేలింది.